వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతల్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దీంతో ఇరువర్గాల మధ్య పచ్చిగడ్డేస్తే భగ్గుమంటోంది.ఎమ్మెల్సీ-ఎమ్మెల్యేల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో వేదికపైనే ఒకరినొకరు తిట్టుకున్నారు.స్టేజ్ పై ఎమ్మెల్సీ,మున్సిపల్ చైర్ పర్సన్ కూర్చోవడంతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వర్గీయులు మంత్రి ముందే రభస చేశారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో.. నియోజకవర్గంలోని పంచాయతీలకు దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీ సురభి వాణిదేవి హాజరయ్యారు.సభ ప్రారంభం అయ్యేముందే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎమ్మెల్యే వర్గీయులు వాగ్వాదానికి దిగారు.దీంతో మంత్రి సమక్షంలోనే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. దీంతో ప్రోటోకాల్ విషయంలో జాగ్రత్తలు పాటించేది లేదా అంటూ.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు స్థానిక కౌన్సిలర్ కూడా తమకు కార్యక్రమం గురించి సమాచారం లేదంటూ..టౌన్ లో నిర్వహించే సభలకు తమను ఆహ్వానించకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో ఎమ్మెల్సీ వర్గీయులు బైఠాయించి నిరసన తెలియజేశారు.మంత్రి సబితా సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.