ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద కాంగ్రెస్ శ్రేణులు రెండుగా విడిపోయాయి. రెండు వర్గాలు ఒకరి కొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఏం జరిగిందంటే… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు ఖండించాయి. ఈ మేరకు రాహుల్ గాంధీకి మద్దతుగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కూడలిలో ఆ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు.
దీక్షా శిబిరం వద్ద జిక్కిడి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మల్లా రెడ్డి వర్గం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణలు చోటుచేసుకుంది.
స్థానికులను ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికేతరులకు ఇంఛార్జిగా వ్యవరించడం సరికాదని జిక్కిడి ప్రభాకర్ వర్గీయులు ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పెయిడ్ కార్యకర్తలను తీసుకొచ్చి దీక్షా శిబిరంలో కూర్చోబెట్టడం సిగ్గు చేటన్నారు.