అధికార పార్టీ బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఈ మధ్య వరుసగా బయటపడి అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. మొన్నటి వరకు మల్కాజ్ గిరి నియోజక వర్గంలో మంత్రి మల్లారెడ్డికి..మిగతా వారికి పడకపోవడంతో నానా రచ్చ జరిగింది. అన్నింటికి మల్లారెడ్డి అడ్డుపడుతున్నారని సొంత పార్టీ వారే ఆయన పై ఆరోపణలు బహిరంగంగా చేయడంతో పార్టీ పరువు బజారున పడినట్లైంది.
ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మీ విషయంలో కూడా అదే జరిగింది. చిలకగూడలో అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన ఆమెను సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులే అడ్డుకోవడంతో పెద్ద రభసే జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో అదే పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు..నువ్వెంతంటే…నువ్వెంత అని ఆరోపించుకోవడంతో.. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇక మ్యాటర్లోకి వెళితే.. పరిగి బీఆర్ఎస్ పార్టీలో చాల కాలం నుంచి ఉన్న కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బద్దలైంది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మైన్ మనోహర్ రెడ్డిపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి విమర్శలు చేశారు. పార్టీలో మేం వదులుకున్న పదవులే మీరు అనుభవిస్తున్నారంటూ మనోహర్ రెడ్డిని ఉద్దేశించి అనిల్ రెడ్డి సభా ముఖంగా విమర్శలు చేశారు. గతంలో తనకు వచ్చిన జడ్పీటీసీ అవకాశాన్ని వదులుకున్నందువల్లే మనోహర్ రెడ్డి జడ్పీటీసీ అయ్యారంటూ అనిల్ రెడ్డి చెప్పారు. ఇంతటితో ఆగని అనిల్ రెడ్డి.. డిసిసిబి చైర్మన్ పదవి కూడా తాము ఇప్పించిందే అంటూ మనోహర్ రెడ్డిని ఎత్తి పొడిచారు.
అనిల్ రెడ్డి మాటలకు మనోహర్ రెడ్డి ఘాటుగానే అందరి ముందు స్పందించారు. జడ్పీటీసీ అయినప్పుడు తన ఆస్తులు కోల్పోయానని..ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశానని….పార్టీ నుండి ఏమి ఆశించలేదన్నారు. మంత్రులు, ఎమ్మేల్యేల సాక్షిగా డిసిసిబి చైర్మన్ పదవి కోసం ఆనాడు ఎవరూ ముందుకు రాకపోతే ఖర్చు భరించి డిసిసిబి చైర్మన్ గా ఎన్నికయ్యానంటూ అనిల్ రెడ్డికి మనోహర్ రెడ్డి కౌంటర్ వేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.