అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా.. రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నట్టు తెలుస్తోంది.
రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్ లైన్స్ కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ.. విమానాల్లోని రేడియో ఆల్టిమీటర్లలో కూడా ఉంటోంది. దీంతో విమానాల ఆల్టిమీటర్లలో ఈ సేవలు జోక్యం చేసుకుంటాయని విమానయాన సంస్థలు భయంతో సర్వీసులను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని ఎయిర్ పోర్టుల చుట్టూ 5జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి.
అయితే.. 5జీ సేవల సాంకేతికతతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో అమెరికా వెళ్లే విమానాలను ఎయిరిండియా రద్దు చేయడంతో.. భారత్ లోని పలువురు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాల్సిన నాలుగు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. ఇది తెలియక హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా అమెరికా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.
తీరా అసలు విషయం తెలిసిన తర్వాత ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు శుక్రవారం నేరుగా హైదరాబాద్ నుంచి షికాగోకు ఎయిరిండియా విమాన సర్వీస్ ఉంది. ఆలోగా సమస్య పరిష్కారం కాకపోతే ఈ విమాన సర్వీస్ నడుస్తుందో లేదో అని ప్రయాణికుల్లో సందిగ్ధంనెలకొంది.