సింగపూర్ మాదిరి హైదరాబాద్ కేంద్రం ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ప్రాంతంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సాగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల నగరానికి మరింత పేరు వస్తుందని తెలిపారు. ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని అన్నారు. అంతే త్వరగా దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారని కొనియాడారు.
ఇప్పుడు ఈ సెంటర్ ఏర్పాటు కోసం నగరంలోని అత్యంత ఖరీదైన గచ్చిబౌలిలో భూమిని కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నాతోపాటు.. కేసీఆర్ కూడా నమ్ముతారని విశ్లేషించారు.
ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవన నిర్మాణం పూర్తి అవుతుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించిన కేసీఆర్ కు కృతజ్ఙతలు తెలుపుకున్నారు రమణ.