రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) షాక్ ఇచ్చింది. ఆయనకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాకు కూడా ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టు పేర్కొంది.
ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి పిల్లలను రష్యాకు చట్టవిరుద్ధంగా పంపించడంతో పాటు ఇతర నేరాల నేపథ్యంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్టు ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్ స్వాగతించింది.
ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లోని చిన్న పిల్లలను చట్ట విరుద్దంగా రష్యాకు తరలిస్తూ యుద్ద నేరాలకు పాల్పడినందుకు ప్రతి అనుమానితుడూ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐసీసీ ప్రీ ట్రయల్ ఛాంబర్ తెలిపింది. భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల్లో ఓ దేశం అధినేతకు ఇలా వారెంటు జారీకావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
ఐసీసీ నిర్ణయంపై రష్యా స్పందించింది. ఇది చాలా దారుణమైన, ఆమోదయోగ్యం కాని వ్యవహారమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి తెలిపారు. తాము ఐసీసీని గుర్తించడం లేదన్నారు. అందువల్ల ఐసీసీ చర్యలు తమకు చట్టపరంగా చెల్లుబాటు కావని ఆయన చెప్పారు.
మరోవైపు శాంతియుత చర్చలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ రష్యాలో పర్యటించనున్నారు. ముడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్ తర్వాత మొదటిసారి ఈ విదేశీ పర్యటన చేయనున్నారు.
ఆయన మూడురోజుల పాటు రష్యాలోనే పర్యటించనున్నట్టు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఉక్రెయిన్‌తో యుద్ధం సహా మరిన్ని కీలక అంశాలపై ఆయన చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 20 నుంచి 22 వరకు ఆయన పర్యటన కొనసాగుతుందని పేర్కొంది.