దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 3 లక్షలకు చేరువలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇందులో ఇంటర్ నేషనల్ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోసారి పొడిగించినట్టు డీజీసీఏ ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 28 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ పేర్కొంది.
గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా దీనిని వచ్చే ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా మొదటివేవ్ లో లాక్ డౌన్ కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తరువాత.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొని రావడానికి 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద కొన్ని విమానాలు నడిపించారు.
2020 జులై నుంచి కొన్ని దేశాలకు మాత్రమే ద్వైపాక్షిక అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సేవల పునరుద్దరించలేదు. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా దాదాపు 40 దేశాలకు ద్వైపాక్షిక అంతర్జాతీయ అనుమతులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. పూర్తి స్థాయి సేవలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్గో సర్వీసులపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు కఠినతరం చేస్తోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 మంది కరోనా బారిన పడ్డారు. ముందు రోజు కంటే సుమారు 45 వేల కేసులు ఎక్కువగా నమోదయ్యయి. ఈ రోజు కరోనాతో 441 మంది మరణించారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 4,87,202కి పెరిగింది. అటు.. కొత్తగా 1,88,157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,55,83,039మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.