ఇదంతా ఇంటర్నెట్ ప్రపంచం. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా… క్షణాల్లో విషయం తెలుసుకోవచ్చు. సమాచారం తెలుసుకోవటం కోసం ఎవరికీ, ఎలాంటి హద్దుల్లేని డిజిటల్ భారతాన్ని కలగన్నాను అంటూ ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రకటించారు. కానీ అలాంటి ఇంటర్నెట్‌పై ఆంక్షల్లో ఇండియానే ముందుంది.
స్టేట్ ఆఫ్ ఇంటర్నెట్ షట్‌డౌన్ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ నిలిపివేతల్లో పాక్ కన్నా ముందే ఉంది భారత్. పాక్‌లో కేవలం 12 సందర్భాల్లోనే నిలిపివేస్తే… భారత్‌లో ఈ సంవత్సరం 91 సందర్భాల్లో నిలిపివేశారు. అందులోనూ 55 సార్లు కేవలం జమ్మూ కశ్మీర్‌లోనే ఆంక్షలు విధించటం గమనార్హం. అయితే గతేడాది ఏకంగా 134సార్లు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది కేంద్ర సర్కార్.
భారత్‌లో జమ్మూ కశ్మీర్ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్నెట్ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని ఆ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం పౌరసత్వ బిల్లుపై దేశంలో ఉద్యమాలు నడుస్తున్నందున ఉత్తర భారతంలో కొన్ని చోట్ల ఈ ఇంటర్నెట్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.