యూపీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లకు గాను 21 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. శాంతి భద్రతల సమస్య పూర్తిగా కంట్రోల్ లో ఉందని..వ్యూహాత్మకంగా పోలీసులను మోహరింపజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని..ఎప్పుడు పునరుర్ధరించాల్సిన అవసరమొస్తే అప్పుడు పునరుద్ధరిస్తామని రాష్ట్ర డీజీపీ చెప్పారు.
శుక్రవారం ప్రార్ధనల అనంతరం అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని డీజీపి తెలిపారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన వాటిలో బిజ్నోర్, బులంద్ షహర్, ముజఫర్ నగర్, మీరట్, ఆగ్రా, ఫిరోజాబాద్, శంభాల్, అలీఘర్, ఘజియాబాద్, రాంపూర్, సీతాపూర్, కాన్పూర్ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చే మెస్సేజ్ లు, వీడియోలను కూడా తాము క్షుణంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. గత శుక్రవారం యూపీలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో 21 మంది చనిపోయారు.