లాక్ డౌన్ ప్రభావంతో అన్ని వ్యవస్థలు కుదేలవ్వగా..లాక్ డౌన్ కారణంగా లబ్ది పోతున్నది ఏమైనా ఉన్నదంటే అది ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అనే చెప్పుకోవాలి. కరోనా ఇండియాలో భారీగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఆదివారం జనతా కర్ఫ్యూ అనంతరం ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కు పిలుపునిచ్చారు. ముంచుకొస్తున్న కరోనా మృత్యుకేళికి అడ్డుకట్ట వేయాలంటే అప్పటికప్పుడు లాక్ డౌన్ విధించాలని కేంద్ర సర్కార్ భావించింది. ఉన్నట్టుండి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడంతో వ్యవస్థలన్ని దివాలా తీస్తున్నాయి. ఇక, ఐటీ సంస్థలు, కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఆఫర్ చేశాయి. దీంతో ఐటీ ఉద్యోగస్తులతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు ఇంటికే పరిమితమై వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.అలాగే కరోనా గురించిన అప్డేట్స్ తెలుసుకోవాలని మొబైల్ డేటా విరివిగా యూస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా జనం కొత్తగా ఇంటర్ నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుండటంతో ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లకు భారీగా డిమాండ్ పెరిగింది.
ఉద్యోగులు మాత్రమే కాదు..ఇంట్లో ఖాళీగా ఉండలేక అస్తమానం టీవీని చూడలేక చాలామంది ఇంటర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సంస్థలు కనెక్షన్ ఏర్పాటుకు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నెట్ వినియోగం పెరిగిపోతోన్న ఈ సమయంలో వినియోగదారుల బలహీనతను ఆసరగా చేసుకొని ఆయా బ్రాడ్ బ్యాండ్ సంస్థలు రేట్లను అమాంతం పెంచేశాయి.