అప్పుడెప్పుడో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన రను మోండల్ మరోసారి అందరి దృష్టిలో పడింది. తాజాగా ఆమె ఓ పాపులర్ సాంగ్ పాడగా, ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల కాలంలో ‘మణికే మాగే హితే’ అనే సాంగ్ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ నుంచి సామాన్యుల వరకు ఈ సాంగ్ విశేషంగా అలరించింది.
శ్రీలంకన్ సింగర్ పాడిన ఈ పాటకు ఇండియాలో విశేష ఆదరణ లభించింది.తాజాగా ఇదే పాటను రను మోండల్ ఆలపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా రను మోండల్ పేరు మరోసారి చక్కర్లు కొడుతోంది. 2019లో ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ సాంగ్ పాడి రను మోండల్ పాపులర్ అయింది. రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ లోని రాణా ఘాట్ రైల్వే స్టేషన్ లో ఆమె లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ పాడిన వీడియో విపరీతంగా వైరల్ అవడంతో రాత్రికి రాత్రే రను ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది.
ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా సింగర్ గా అవకాశం ఇచ్చారు. అప్పటి దాకా ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించిన జనాలు ఆ తర్వాత రను గురించి మర్చిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకు సంబంధించిన వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వీడియోకు 54,000 వ్యూస్ రావడం విశేషం.