ఖలిస్తాన్ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్నున్ అరెస్టులో సహకరించవలసిందిగా ఇండియా చేసిన అభ్యర్థనను ఇంటర్ పోల్ తిరస్కరించింది. అతనిపై ‘ఉగ్రవాద అభియోగాలున్నాయని’, అందువల్ల రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ప్రభుత్వం రెండో సారి చేసిన విజ్ఞప్తిని కూడా ఈ సంస్థ తోసిపుచ్చింది. కెనడాలో ఉంటున్న గురు పత్వంత్ సింగ్ ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుడు, లీగల్ అడ్వైజర్ కూడా. ఇతనికి సంబంధించిన తగినంత సమాచారాన్ని ఇవ్వలేకపోయినందున మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని ఇంటర్ పోల్ వర్గాలు భారత అధికారులకు తెలిపాయి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం కింద రెడ్ కార్నర్ నోటీసు జారీ చెయవలసిందిగా మీరు కోరుతున్నారని, కానీ మైనారిటీ వర్గాలను టార్గెట్ చేయడానికి దీన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలున్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మైనారిటీ గ్రూపుల హక్కులను ఈ చట్టం హరించేవిధంగా ఉందన్నఆరోపణలు ఉన్నాయి కూడా అని ఇవి గుర్తు చేశాయి.
పన్నున్ హై ప్రొఫైల్ సిక్కు వేర్పాటువాది అని, స్వతంత్ర ఖలిస్తాన్ ఏర్పాటు కోసం సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ పోరాడుతోందన్న విషయాన్ని ఇంటర్ పోల్ అంగీకరిస్తూనే.. ఓ మెలిక పెట్టింది. పన్నున్ కార్యకలాపాల్లో క్లియర్ పొలిటికల్ పోకడలు ఉన్నాయని, అవి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేంత తీవ్ర స్థాయిలో లేవని ఈ సంస్థ పేర్కొంది.
ఇతగాని చర్యలు ఉగ్రవాద కార్యకలాపాలకు అనుగుణంగా ఉన్నాయనే విషయంలో అందుకు తగినట్టుగా ఇండియా తగినంత సమాచారాన్ని ఇవ్వలేకపోయిందని ఇంటర్ పోల్ అభిప్రాయపడినట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ సంస్థ నిర్ణయంతో భారత నేషనల్ కంట్రోల్ బ్యూరో ఖంగు తింది. జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున ఈ బ్యూరో.. గత ఏడాది మే 21 న ఇంటర్ పోల్ కి విజ్ఞప్తి చేసింది.