ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఇన్ స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. అమెరికాతో పాటు యూకే,ఆస్ట్రేలియాలో ఇన్ స్టా నిలిచిపోయిందంటూ వేలాదిగా ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే అమెరికాలోని ఇన్ స్టా యూజర్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. అమెరికా వ్యాప్తంగా దాదాపుగా 46 వేల మందికి పైగా యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇక గురువారం వేలాది మంది యూజర్లు యాప్ లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.
యూకే నుంచి 2000 మంది, భారత్, ఆస్ట్రేలియా నుంచి 1000 మంది చొప్పున యూజర్లు ఈ సమస్యపై మెటా సంస్థకు రిపోర్ట్ చేసినట్లు వెబ్ సైట్ పేర్కొంది. అయితే ఈ అంతరాయానికి కారణమేంటనే విషయంపై ఇప్పటి వరకు ఇన్ స్టా మాతృ సంస్థ మెటా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలిపింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ కథనంలో వెలువరించింది.