ప్రస్తుత సమాజంలో నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో కన్నుమిన్ను ఎరుగక అనర్దాలకు పాల్పడుతున్నారు. ఆడ మగ అని తేడా లేకుండా మత్తు పదార్ధాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ గొడవలకు పాల్పడుతున్నారు.
ఇదొక్కటే కాదు.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అయితే.. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న యువత మాత్రం మారడం లేదు. తాజాగా.. ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.
సుబర్నా పాండే అనే యువతి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. అక్కడ స్క్రీనింగ్ చేస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించింది. అంతేకాకుండా.. ఆ ఉద్యోగిని బూతులు తిడుతూ దాడికి యత్నించింది. అరగంట పాటు గేట్ నెంబర్ 24 వద్ద యవతి నానా హంగామా చేసింది.
వెంటనే యువతిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆమెను ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అయితే సదరు యువతి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ యువతి మధ్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.