అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సేనలు వెళ్లిపోయాక తాలిబన్లు అధికారం చేపట్టేందుకు రెడీ అయ్యారు. తాలిబన్లకు అంతర్జాతీయ సమాజం నుండి ఎంత వరకు అంగీకారం దొరకుతుందన్న విషయంపై చర్చ కొనసాగుతున్న సందర్భంలో… ఉగ్రవాద కార్యకలాపాలు చేసే సంస్థలు తాలిబన్లను పొగడటం, అందరం ఒక్కటే అన్న సందేశాలను బాహ్య ప్రపంచానికి పంపుతుండటం ఇప్పుడు అందర్నీ కలవరపెడుతోంది.
అయితే, తాలిబన్ నాయకులు కొందరు అంతర్జాతీయ సముహానికి కొంత అనుకూల ప్రకటనలు చేస్తున్నారు. కానీ తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారో మాత్రం చెప్పటం లేదు. వారికి కూడా క్లారిటీ లేనట్లుగానే కనిపిస్తోంది. ముల్లా హైబతుల్లా పెద్దగా కనపడకపోవటం అందర్నీ కలవరపెడుతోంది. ముల్లా బరాదర్ వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ భయంకరమైన హక్కానీలు ఎం చేస్తారన్నది కూడా టెన్షన్ పెడుతుంది.
గత ప్రభుత్వంలో పనిచేసిన నేతలంతా ఫెయిర్ కాదన్నది ఓపెన్ సీక్రెట్. కాబూల్ కేంద్రంగా జరిగిన అంతర్యుద్ధాల్లో వీరి పాత్ర కూడా ఉంది. అబ్ధుల్ గనీ ప్రభుత్వంలో పనిచేసిన వారిలో చాలా మందిపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. కానీ తాలిబన్ల విషయంలో పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయన్న భావన ఏర్పడింది. ఏ ప్రభుత్వం వచ్చిన అక్కడ పెద్దగా మార్పు రాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా నియంత్రణలో ఉన్న సమయంలోనూ పరిస్థితులు ఆశించినంతగా మారలేదని గుర్తు చేస్తున్నారు.
తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఉగ్రవాద చర్యలను నిరోధించాలనుకున్నా… ఇప్పటికప్పుడు అది సాధ్యం కాదు. అక్కడ ఉన్న డ్రగ్స్ సరఫరా, బందిపోటు వ్యవహరాలు, కిడ్నాప్ ల సంస్కృతి పోవాలంటే చాలా సమయం పడుతుందని ఐక్యరాజ్య సమితి కూడా గతంలో హెచ్చరించింది. తాలిబన్లను నడిపించేది ఎవరైనా వీటిని తొలగించటం అంత సులువైంది కాదు.
పైగా అల్ ఖైదా, తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ సహా దాదాపు 8వేలకు పైగా గ్రూపులు ఇన్నాళ్లుగా తాలిబన్లకు అండగా ఉంటూ వచ్చాయి. వారి వద్ద లక్షలాది వెపన్లు ఇంకా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు పొరుగున ఉన్న ఇండియా సహా ఎన్నో దేశాలకు పెను ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉందని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. పైగా జైషే మహ్మద్ వంటి కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్నసంస్థలు కూడా ఉండనే ఉన్నాయి. మసూద్ అజర్ కాశ్మీర్ పై తమకు అనుకూలంగా తాలిబన్లను ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. అఫ్గన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయిబా కూడా ఉండనే ఉంది. అమెరికా అఫ్గన్ నుండి వైదొలగగానే ఈ సంస్థలన్నీ తాలిబన్లను కాశ్మీర్ విషయంలో తమకు అనుకూలంగా ప్రకటనలిప్పించేందుకు పోటీ పడ్డాయి.
తాలిబన్ నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ వస్తోంది. అయితే, పాక్ మీడియా మాత్రం తాలిబన్లు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం మొదలుపెట్టింది. కాబూల్ ను భారత్ దరి చేరకుండా చూసే ఎత్తుగడగా విదేశీ వ్యవహరాల నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఎక్కడ ఎలాంటి హింస చెలరేగే ప్రయత్నం జరిగిన టార్గెట్ పాక్ అనే నినాదాన్ని భారత్ ప్రముఖంగా ప్రస్తావించాలని వారు సూచిస్తున్నారు. అయితే, ఇలాంటి విషయాల్లో భారత్ కు వ్యతిరేకంగా పనిచేసే సమయంలో పక్కనే ఉన్న చైనా సహయం అందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు.