– యాక్ట్ 51 రిపోర్ట్ కరెక్టే..
– ఎట్టకేలకు ముగిసిన సెక్షన్ 60 ఎంక్వైరీ
– రూ.111 కోట్లు పక్కదారి
– బాధ్యులుగా 16 మంది
చిత్రపురి కాలనీ అవినీతిపై విచారణ ముగిసింది. దాదాపు 11 నెలలకు ఎంక్వైరీ పూర్తి చేశారు కో ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్టర్ రామచంద్రమ్మ. ఈ ఇష్యూలో 111 కోట్ల అవినీతి జరిగినట్టు తేల్చారు. 16 మందిని బాధ్యులుగా గుర్తించారు. అయితే.. ఎంక్వైరీపై టెంపరరీ స్టే కోసం ట్రైబ్యునల్ కి వెళ్లారు ప్రస్తుత కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు. అగ్రిమెంట్ కి మించి కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ల రూపంలో డబ్బులు ఇచ్చినట్టు విచారణలో తేలింది.
చిత్రపురి అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయించిన వారి సభ్యత్వాలను తీసివేస్తామని వల్లభనేని అనిల్ కుమార్, కాదంబరి కిరణ్, మహానంద రెడ్డి హెచ్చరించానా.. నోటీసులు పంపినా మొక్కవోని దీక్షతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ న్యాయపోరాటం చేయటంతో అధికారులు దిగిరాక తప్పలేదని అంటున్నారు చిత్రపురి సాధన సమితి సభ్యులు. హైకోర్టు ఈ అక్రమార్కులకు వ్యతిరేకంగా దాదాపుగా 7 ఆర్డర్స్ ఇచ్చినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని.. ట్రైబ్యునల్ లో స్టే తెచ్చుకొనేందుకు సహకరించారని అంటున్నారు. దాదాపు 10 నెలలు చిత్రపురిలో మరిన్ని అక్రమాలు జరిగేందుకు, దొంగ రిజిస్ట్రేషన్ లు జరిపేందుకు అవకాశం కల్పించారని.. దాని అధికారులే బాధ్యత వహించాలని చెబుతున్నారు. హైకోర్టు ఆర్డర్స్ వున్నా ట్రైబ్యునల్ స్టేలు ఎలా ఇస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు. సమస్యల పట్ల అవగాహన లేకుండా ట్రైబ్యునల్ వ్యవహారిస్తోందని, ఆర్డర్స్ ఇస్తోందని గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేస్తున్నారు.
కోట్ల రూపాయల సభ్యుల సొమ్ము బొక్కేయడమే కాకుండా 2005-2020 కమిటీ సభ్యులు చేసిన అక్రమాలు వందల సాక్ష్యాలతో సహా చిత్రపురి పోరాట సమితి సభ్యులు రంగారెడ్డి డీసీవో ధాత్రికి , తెలంగాణ కో ఆపరేటివ్ కమిషనర్ వీరబ్రహ్మయ్యకి గతేడాది అందజేశారు. కానీ.. ఇంతవరకూ 16 మందిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమాలకు కారణం అయిన మొత్తం 16 మంది సభ్యత్వాలను, వారి యూనిట్స్ ని రద్దు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేదంటే ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమం రూపొందిస్తామని చిత్రపురి పోరాట సమితి హెచ్చరించింది.
కన్ స్ట్రక్షన్ అకౌంట్ కి అధిక మొత్తంలో సొసైటీ నుండి డబ్బులు బదిలీ చేసి మళ్లీ నగదు రూపంలో వెనక్కు తీసుకున్నారని యూవర్స్ కన్ స్ట్రక్షన్ అధినేత బీవీ నాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత కమిటీలో ఉన్న ఐదుగురు జనరల్ బాడీ కూడా జరపొద్దని గతంలో స్టే ఇచ్చింది హైకోర్టు ఐతే మళ్ళీ స్టే కోసం ట్రైబ్యునల్ కి వెళ్లడం ఇష్యూను పక్కదారి పట్టించడమేనని చిత్రపురి సాధన సమితి ఆరోపిస్తోంది. అక్రమాలు ఇంకా చేయటానికే అని అంటోంది. ఇప్పటికే ట్రైబ్యునల్ లో 9 నెలల నుండి స్టే కొనసాగించుకుంటున్నారని చెబుతోంది.
జనరల్ బాడీ మీటింగ్ జరిపేందుకు మీరు అనర్హులు అని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తక్షణమే ఐదుగురు రాజీనామా చేయాలి. కానీ.. అలా చేయకుండా కొనసాగుతున్నారని పోరాట సమితి ఆరోపిస్తోంది. చిత్రపురి అక్రమాలపై పోరాటం ప్రారంభించిన నాటినుండి అన్ని రకాలుగా ఉద్యమానికి సహకరించిన ఏఐటీయూసీ, సీఐటీయూలకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకి ధన్యవాదాలు తెలిపింది. మీ సహాయ సహకారాలు మరింతగా భవిష్యత్ ఉద్యమానికి కావాలని కోరింది.