దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎన్ కౌంటర్ కు గురైన బాధితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్ వాదనలు వినిపించారు.
ఎన్ కౌంటర్ జరిగిన తీరును ఆమె హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరిట పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని ఆమె అన్నారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీసీటీవీలో లారీని చూసి దాని యజమాని శ్రీనివాస్ రెడ్డే మొదట గుర్తు పట్టారని పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. కానీ కమిషన్ విచారణ సందర్భంలో మాత్రం శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని చెప్పలేదని ఆమె తెలిపారు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ రోజుతో ఈ కేసులో ఆమె వాదనలు ముగిశాయి. ఇక దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించాల్సి వుంది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం 23న వాదనలు వినిపించనుది. ఈ క్రమంలో కేసు విచారణను ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది.