మెగాస్టార్ చిరంజీవి నివాసానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు. ఉగాది పర్వదినం సందర్భంగా.. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు ఆహ్వానించారు.
అయితే.. ఈ 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు చిరంజీవి. ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కళాకారులకు జీవనోపాధి దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం వారికి గొప్ప వేదిక అవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తన నివాసానికి వచ్చిన కిషన్ రెడ్డిని శాలువాకప్పి సత్కరించారు చిరంజీవి.
హైదరాబాద్ వేదికగా మరో జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమివ్వనున్నాయి.