కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో పాదయాత్రలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘పాల్గొంటారా’ ? నమ్మశక్యం కాని విషయం ! విచిత్రం కూడా.. జనవరి 3 న యూపీలో ప్రవేశించనున్న ఈ యాత్రలో పాల్గొనాలంటూ దీపక్ సింగ్ అనే కాంగ్రెస్ నేత ఈ నెల 28 న స్మృతి ఇరానీ అసిస్టెంట్ ప్రైవేట్ సెక్రెటరీ నరేష్ శర్మకు ఓ ఇన్విటేషన్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. భారత్ జోడో పాదయాత్రలో అందరూ పాల్గొనేలా చూడాలంటూ సీనియర్ పార్టీ నేతలు తనను ఆదేశించారని మాజీ విధాన పరిషత్ సభ్యుడైన దీపక్ సింగ్ తెలిపారు.
అందువల్లే మొట్టమొదట ఈ ‘ఆహ్వాన పత్రిక’ ను అమేథీ ఎంపీ అయిన స్మృతి ఇరానీకి ఇచ్చేందుకు గౌరీ గంజ్ లోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లి దీన్ని నరేష్ శర్మకు అందజేశానని ఆయన చెప్పారు. దీన్ని ఆయన అంగీకరించారని, తమ మేడంకి అందజేస్తానని చెప్పారని దీపక్ సింగ్ చెప్పారు.
ఈ విషయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు దుర్గేష్ త్రిపాఠీ కూడా సానుకూలంగానే స్పందించడం విశేషం. తమ పార్టీ ఎప్పుడూ సమైక్య భారతావనినే కోరుకుంటుందని, ఇండియా చీలిపోనప్పుడు.. ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రసక్తే తలెత్తదని ఆయన అన్నారు.
మరణం అంచుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ యాత్ర చేబట్టారని ఆయన ఎద్దేవా చేశారు. జనవరి 3 న ఘజియాబాద్ ద్వారా రాహుల్ యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ప్రవేశించనుంది. మరి ఈ ఆహ్వానంపై స్మృతి ఇరానీ ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.