క్రీడలు లేదా శారీరక అక్షరాస్యతను ప్రాథమిక హక్కుగా చేసే అంశంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు కోరింది. ఆర్టికల్ 21ఏ ప్రకారం క్రీడలను ప్రాథమిక హక్కుగా మార్చాలని 2018లో కనిష్క పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ సమయంలో ఈ మేరకు ప్రభుత్వాలను కోరింది.
క్రీడల్లో పాల్గొనడం పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, లేకపోతే వారు ఎక్కువ సమయం డిజిటల్ గ్యాడ్జెట్స్ తో గడపాల్సి వస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సమస్యను పరిశీలించడానికి సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్‌ను 2019లో అమికస్ క్యూరీగా అత్యున్నత న్యాయస్థానం నియమించింది. ముఖ్యంగా పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలను స్కూల్ ముగిసి తర్వాత ఇరుగుపొరుగు పిల్లలు ఆడుకునేందుకు తెరవాలని సూచించింది.
పాఠశాలలో క్రీడా ఈవెంట్లలో మంచి ప్రతిభ కనబరిచే చాలా మంది విద్యార్థులు క్రీడలను కెరీర్‌గా చూడటం లేదని బెంచ్ తప్పుబట్టింది. చాలా మంది విద్యార్థులు 12వ తరగతి వరకు క్రీడల్లో బాగా రాణిస్తారని ఆ తర్వాత వాటిని మరచిపోతారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వీవీఎస్ లక్ష్మణ్ తల్లిదండ్రులు డాక్టర్లు అనీ అయినప్పటికీ వారి కొడుకు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నప్పుడు వారి సపోర్ట్ చేసిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది.