సాధారణంగా ఒక మోస్తరు ఎత్తు నుంచి ఫోన్లు కింద పడితే కొన్ని సార్లు ఏమీ కాదు. కానీ కొన్ని సార్లు చిన్నపాటి ఎత్తు నుంచి కింద పడ్డా ఫోన్లు పగులతాయి. డిస్‌ప్లే, బాడీ అంతా పగులుతుంది. అయితే ఆ వ్యక్తికి చెందిన ఐఫోన్ ఏకంగా 2వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. అయినా దానికి ఏమీ కాలేదు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
బ్రెజిల్‌లోని రియో డి జనెరియోలోని ఓ బీచ్‌పై విమానంలో వెళ్తూ ఎర్నెస్టో గాలియోటో అనే వ్యక్తి డాక్యుమెంటరీ ఫిలిం తీస్తున్నాడు. తన ఐఫోన్ 6ఎస్ ఫోన్‌ను చేతుల్తో పట్టుకుని దాన్ని కిటికీ నుంచి బయటకు పెట్టి వీడియో తీస్తున్నాడు. అయితే బలమైన గాలులు వీయడం వల్ల చేతుల్లో ఉన్న ఐఫోన్ కింద పడింది. సుమారుగా 2వేల అడుగుల ఎత్తు నుంచి ఆ ఫోన్ బీచ్ కు సమీపంలో పడిపోయింది.
అయితే అనూహ్యంగా ఆ ఫోన్ ను ఫైండ్ మై ఐఫోన్ ద్వారా ఎర్నోస్టో గుర్తించాడు. అది అంత ఎత్తు నుంచి కింద పడినా దానికి ఏమీ కాలేదు. కేవలం ఆ ఫోన్ స్క్రీన్ గార్డ్ పగిలింది. దానికి వెనుక వైపు కేస్ ఉంది. ఇక ఫోన్‌పై చిన్న గీత కూడా పడకపోవడం విశేషం. దీంతో ఎర్నెస్టో షాక్‌కు గురయ్యాడు.
ఇక ఇలా జరగడం మొదటిసారి ఏమీ కాదు. గతంలో ఐస్‌ల్యాండ్‌కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ ఐఫోన్ 6ఎస్ ఫోన్ కూడా ఇలాగే విమానం నుంచి కింద పడింది. తరువాత 13 నెలలకు ఆ ఫోన్ దొరికింది. అయితే ఐఫోన్ 6ఎస్ ఫోన్లకు మాత్రమే ఇలా జరుగుతుండడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆ ఫోన్ల బిల్డ్ క్వాలిటీకి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.