ప్రస్తుత కాలంలో ఫోన్‌తో ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ.. ఫోన్ వాడితే ప్రాణాలు పోతాయని పెద్దలు తరచూ తిడుతుంటారు. అన్నింటికి ఫోన్‌తో లింకు పెట్టి అది జరిగిపోతోంది. ఇది అయిపోతుందంటూ అంటుంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఐఫోన్ స్మార్ట్ ఫోన్ ఒక వ్యక్తి నిండు ప్రాణాలను కాపాడింది. ఫోన్ ప్రాణాలు కాపాడటమేంటి..? ఎలాగో మీరే తెలుసుకోండి.
స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్ సమీపంలో టిమ్ బ్లేకి(41) అనే వ్యక్తి ఓ మంచు కొండపై స్నో బోర్డింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ స్నో బోర్డింగ్ చేస్తుండగా అదుపు తప్పి సుమారు పది వేల అడుగుల కిందకు పడిపోయి.. మంచు పగుళ్ల మధ్య చిక్కుకుపోయాడు. అయితే పైకి రావడం కష్టమైపోయింది. సాయం కోసం ఎవరినైనా పిలవాలనుకున్నా.. చుట్టూ మంచు తప్ప ఏమీ లేదు. ఈ క్రమంలో అతడి దగ్గర ఉన్న ఐఫోన్ తీసుకుని ఎవరికైనా ఫోన్ చేద్ధామని అనుకున్నాడు. కానీ తన ఐఫోన్‌లో కేవలం మూడు శాతం మాత్రమే బ్యాటరీ ఉంది. ఎవరికైనా ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేదు. వెంటనే టిమ్ బ్లేకికి ఒక ఐడియా వచ్చింది.
తనను తాను రక్షించుకోవడానికి ఐఫోన్‌లోని ఎస్‌వోఎస్ ఫీచర్‌ను నొక్కాడు. అయితే ఈ సందేశాన్ని అందుకున్న రెస్క్యూ టీమ్ టిమ్ బ్లేకీ ఉన్న ప్లేస్‌కు చేరుకున్నారు. అయితే అతనిని రక్షించడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది. తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు. అలా మృత్యువు అంచు వరకూ వెళ్లిన టిమ్.. ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
టిమ్ బ్లేకీ తనుకు జరిగిన ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. 17 ఏళ్లు స్నో బోర్డింగ్‌లో అనుభవం ఉన్న టిమ్.. తన భయానక అనుభవాన్ని అందరికి తెలిపాడు. అలాగే స్నోబోర్డింగ్‌లో అనుభవం ఉన్నా.. ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకుపోకుండా ఉండాలంటే ఒంటరిగా స్నో బోర్డింగ్ చేయడం మానుకోవాలని ఓ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఎస్‌వోఎస్ ఫీచర్‌ను పెట్టినందుకు యాపిల్‌కు, రెస్క్యూ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. గతంలో కూడా ఎంతోమంది ఐఫోన్‌లో ఈ ఫీచర్‌తో తమ ప్రాణాలను కాపాడుకున్నారు.