ఐపీఎల్-15 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్లేఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లపై క్లారిటీ రానుంది. మరో 10 రోజుల్లో లీగ దశకు తెరపడనుంది. అయితే, కరోనా భయం లేకపోవడంతో ఈసారి ఐపీఎల్ ముగింపు వేడుకల్ని అత్యంత ఘనంగా ప్లాన్ చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే మే 29వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఒక ఏజెన్సీకి ఇందుకు సంబంధించిన పనులను కూడా అప్పజెప్పింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరగా.. ఆ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉంది. మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కూడా ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు మ్యాచులు, సమీకరణాల గొడవలో ఉండగా.. బీసీసీఐ మాత్రం ముగింపు వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించింది.
సాధారణంగా ఐపీఎల్ ఆరంభ, ముగింపు వేడుకలను బీసీసీఐ భారీ స్థాయిలో నిర్వహించేది. కానీ కరోనా పుణ్యమా అని 2020 నుంచి ప్రేక్షకులకు ఆ సంబరాలు కరువయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు కూడా జరుగలేదు. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఐపీఎల్ 2022 ముగింపు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మే 29వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఇందులో భాగంగా ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటుడు, ఇటీవలే 83 సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న రణ్వీర్ సింగ్‌తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎఆర్ రెహ్మాన్‌తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటోంది. మే 29న ఫైనల్ కు ముందు 45 నిమిషాల పాటు ఈ ఇద్దరూ తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు గాను ఆ ఇద్దరికీ భారీ నజరానాను కూడా ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అలాగే, 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో టీమిండియా క్రికెట్ ఎదుగుదలకు సంబంధించిన డాక్యుమెంటరీని కూడా సిద్ధం చేస్తోంది బీసీసీఐ. అంతేకాదు, టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారిని సత్కరించాలని భావిస్తోంది. భారత జట్టు మాజీ సారథులందరినీ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసిందని వార్తలు వస్తున్నాయి.
ఇక మే 24వ తేదీన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ మే 25వ తేదీన జరగనుంది. ఇక మే 27వ తేదీన అహ్మాదాబాద్‌లో రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇక మే 29న అహ్మాదాబాద్ స్టేడియంలో ఫైనల్ ఉంటుంది.