ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఐపీఎల్ మంచి వేదికగా నిలుస్తోంది. యువ క్రికెటర్లకి కూడా ఇక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. కానీ, అందరు ఆటగాళ్లు వారి జట్లకి, తీసుకున్న రెమ్యునరేషన్‌కి న్యాయం చేయలేరు. ఈ క్రమంలో టోర్నీ ప్రారంభానికి ముందే క్రీడాభిమానులు కొందరి ఆటగాళ్లపై అంచనాలు వేసుకుంటుంటారు. అయితే, అంచనాలు అప్పుడప్పుడు తప్పవుతుంటాయి. తాజా ఐపీఎల్ సీజన్‌లో కూడా అదే జరుగుతోంది. వీళ్లేం ఆడుతారులే అనుకున్నా ఆటగాళ్లే మైదానంలో రికార్డులు సృష్టిస్తోన్నారు. అందరీ అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, ఉమేశ్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్.
హార్దిక్ పాండ్యా..
వెన్నునొప్పి శస్త్రచికిత్స తర్వాత సరైన ప్రదర్శన చేయలేక టీమిండియాలోనే చోటు కోల్పోయాడు. అంతే కాదు, గత రెండేళ్లుగా ముంబై తరపునా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇలాంటి స్థితిలో ఈసారి కొత్తగా చేరిన జట్టు గుజరాత్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకోవటం పెద్ద విశేషమనే చెప్పాలి. కానీ, ఈ సీజన్‌లో పాండ్యా కెప్టెన్‌గా రాణిస్తూ.. బ్యాట్స్‌మన్‌గా చెలరేగుతూ.. బౌలర్‌గా నిలదొక్కుకుంటున్నాడు. దీంతో మళ్లీ మునుపటి ఆల్‌రౌండర్‌గా అభిమానులను అలరిస్తున్నాడు.
ముంబై తరపున గత రెండు సీజన్లలో 281, 127 పరుగులే చేసిన పాండ్య ఈసారి టోర్నీలో సగం మ్యాచ్‌లు కూడా ఆడకముందే 228 పరుగులతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు బౌలింగ్ చేస్తూనే అడపా దడపా వికెట్లు తీస్తూ.. ఈ సీజన్‌లో మేటి ఆటగాడిగా సత్తా చాటుతున్నాడు.
శివమ్ దూబే..
2019 నుంచి ఈ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు దూబే. ఈ క్రమంలో 2019, 2020 సీజన్లలో బెంగళూరు తరపున ఆడిన అతడు ఏమాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక, గత సీజన్‌లో రాజస్థాన్ తరపున ఒక్క మ్యాచ్‌లో మాత్రమే మెరిశాడు. కాగా, 42 బంతుల్లో 64 పరుగులు చేసి రాజస్థాన్‌ను గెలిపించాడు. దీంతో అతడి ప్రతిభను గుర్తించిన చెన్నై ఈసారి మెగా వేలంలో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు తరపున విశేషంగా రాణిస్తున్నాడు.
ఇప్పటి వరకు చెన్నై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటమిపాలైనా చివరగా బెంగళూరుపై విజయం సాధించింది. అందులోనూ దూబే 95 పరుగులు దంచికొట్టాడు. అంతేకాదు లఖ్నోతో ఆడిన మ్యాచ్‌లో 49, పంజాబ్‌పై 57 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అతడు 207 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఉమేశ్ యాదవ్..
టీమిండియా తరపునా అవకాశాలు సన్నగిల్లటం.. గతేడాది ఈ టీ20 లీగ్ ఆడకపోవటంతో ఇతడిపై పెద్దగా ఎవరు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో మెగా వేలం తొలి రౌండ్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ, రెండో రౌండ్‌లో కోల్‌కతా కనీస ధర రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో చెన్నైతో తొలి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వటంతో తన సత్తా నిరూపించుకుంటూ.. పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఇద్దర్నీ ఔట్ చేసి కోల్‌కతాకు శుభారంభం అందించాడు.
ఆపై బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీసి మరోసారి గొప్ప ఆరంభం అందించాడు. తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ముంబైతో మ్యాచ్‌లో రోహిత్‌ను.. ఢిల్లీతో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేసి తమ జట్టుకు పెద్ద ఊరట కలిగించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు, ఉమేశ్ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చాడు.
కుల్‌దీప్ యాదవ్..
టీమిండియా జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ టీ20 లీగ్‌లో దీర్ఘకాలం కోల్‌కతా తరపున ఆడాడు. ఈ క్రమంలోనే 2017, 18 సీజన్లలో అద్భుత బౌలింగ్ చేశాడు. కానీ, 2019, 20 సీజన్లలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడు తర్వాత టీమిండియాలో చోటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కుల్‌దీప్‌పై ఈసారి ఎవరికీ పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. కానీ, ఈ సీజన్‌లో వరుసగా రెచ్చిపోతూ ప్రత్యర్థుల వికెట్లను నేలకూలుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 10 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
Advertisements