భారత పేస్‌లో బలమైన ఆయుధం జస్‌ప్రిత్ బుమ్రా. బుమ్రా చేతిలో బాల్ ఉందంటే… లక్ష్యం ఎంత తక్కువగా ఉన్నా కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా బుమ్రా యార్కర్స్ బ్యాట్స్‌మెన్‌ను బెంబెలెత్తిస్తుంటాయి. ఐపీఎల్ ప్రస్తుతం ముంబాయి తరుపున ఆడుతున్న బుమ్రా, కోల్‌కతా తమకు వద్దులే అనటంతో వేలంలోకి వచ్చిన ఓపెనర్ క్రిస్ లిన్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోల్‌కతా తరుపున సక్సెస్‌ఫుల్ రికార్డ్ ఉన్నప్పటికీ జట్టు యాజమాన్యం మాత్రం క్రిస్ లిన్‌ను అంటిపెట్టుకోలేదు. దీంతో 2 కోట్ల కనీస ధరతో లిన్ వేలంలోకి వచ్చేశాడు. గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో… లిన్‌ను ముంబాయి దక్కించుకుంది. తన బేస్ ధరకే ముంబాయి లిన్‌ను దక్కించుకుంది. విధ్వంసకర ఆటగాడిగా పేరున్నప్పటికీ లిన్ కోసం ఎవరూ ముందుకు రాకపోవటం విశేషం.
అయితే, వేలం ముగిసిన తర్వాత లిన్ బుమ్రాపై ఓ కామెంట్ చేశారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను… ఇక ఐపీఎల్‌లో బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో అన్న బాధ అయితే నాకు లేదు అంటూ చమత్కరిస్తూ… నేను ముంబాయికి మారను అని చెప్పాడు. దీనికి కౌంటర్‌గా బుమ్రా తన కామెంట్స్‌తో యార్కర్ వేసి బౌల్డ్ చేసేశాడు. డైరెక్ట్‌గా ఆటలో తప్పించున్నంత మాత్రాన వదిలిపెడతానా… నెట్స్‌లో అయినా నన్ను, నా పేస్‌ను ఫేస్ చేయాల్సిందే కదా అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇటీవలే పాక్ మాజీ ఆటగాడు అబ్ధుల్ రజాక్ బుమ్రాను తీసివేసినట్లు మాట్లాడి అభిమానుల ఫైర్‌ను రుచి చూడగా… క్రిస్ లిన్ మాత్రం మా బుమ్రా అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.