ఓవైపు ఐపీఎల్ మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతుంటే.. ఇంకోవైపు బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలో అంతర్రాష్ట్ర బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రూ.11.80 లక్షల నగదు, ఒక కారు, 2 బైక్ లు సీజ్ చేశారు. అలాగే , అకౌంట్ లో ఉన్న రూ.31.17 లక్షల క్యాష్ ను ఫ్రీజ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేష్ భగవత్ మీడియాకు వివరించారు. సాయిరాం వర్మ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ ముఠా ప్రధాన నిందితుడు అని తెలిపారు. యానాం నుండి ఇదంతా నడిపిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో నాగరాజు అంతా చేస్తున్నాడన్నారు. యానాం నుండి ఆన్లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న సాయిరాం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రోమన్ కాథలిస్ కులందై స్వామి పేరుపై యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో అకౌంట్ లు ఉన్నాయని.. సాయిరాం వర్మనే ఈ అకౌంట్స్ తీసి ఉంటాడని అనుమానం ఉందన్నారు. అతను దొరికితే పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారు సీపీ. నాగరాజు 2016లో కూడా బెట్టింగ్ కేస్ లో అరెస్ట్ అయినట్లు వివరించారు.
యానాంలో ఉండే సాయిరాం వర్మ సిస్టం నుండి లింక్ ఇస్తే ఇక్కడ బౌలింగ్ జరిగే సమయంలో రేటింగ్ ఆధారంగా బెట్టింగ్ జరుగుతోందన్నారు సీపీ. పేటీఎం, గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న పరిచయాల ఆధారంగా ఈ బెట్టింగ్ నడుస్తోందన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు మహేష్ భగవత్.