ఐపీఎల్ ప్రారంభం అయిన నేపథ్యంలో.. క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో బెట్టింగ్ లు జరుగుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారంతో.. బెట్టింగ్ స్థావరాలపై దాడి చేసిన రాచకొండ పోలీసులు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారి నుండి భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. దేవినేని చక్రవర్తి అనే వ్యక్తి.. ఐపీఎల్ బెట్టింగ్ ల కోసం ఓ ప్రత్యేక యాప్ తయారు చేశాడు. అందులో బెట్టింగ్ రాయుళ్లను భాగస్వాములుగా చేసి.. దందా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఎనిమిది బ్యాంకుల ఖాతాల్లో రూ. 90 లక్షల వరకు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశామన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని అంటున్నారు.
గతంలో గోవా, బెంగళూరులోనూ చక్రవర్తి భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రైవేటు సంస్థల పేరుతో ఆయా బ్యాంకుల్లో ఖాతాలను తెరిచి.. బెట్టింగ్ లు సాగిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.