హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ లకు సిద్ధమైంది. ఆదివారం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగునుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఎంపికైన మార్ క్రమ్ గైర్హాజరీతో రాజస్థాన్ తో నేడు జరిగే పోరుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం నలుమూలల నుంచి ఉప్పల్ మార్గంలో ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతుంది మెట్రో. అదేవిధంగా నాగోల్-అమీర్‌పేట మార్గంలో మెట్రో అదనంగా రైళ్లు నడుపుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్టీసీతో పాటు మెట్రో కూడా మరిన్ని సర్వీసులను నడుపనుంది.
కాగా మ్యాచ్ సందర్భంగా పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులను భద్రత విధులకు కేటాయించారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మ్యాచ్ ఆరంభానికి ముందు, ముగిసిన తర్వాత సికింద్రాబాద్, హబ్సిగూడ, తార్నాక, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, అంబర్‌పేట, రామంతపూర్, ఎన్‌ఎస్‌ఎల్ ఎరీనా, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ ఎక్స్‌రోడ్, కేవీ-1 స్కూల్, వరంగల్ హైవే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.
స్టేడియం లోపల, వెలుపల 340 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాయింట్ కమాండ్, కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియాన్ని తెరుస్తామని, నైట్ మ్యాచ్ లు జరిగిన సమయంలో సాయంత్రం 4:30 గంటలకు స్టేడియాన్ని తెరువనున్నట్లు వివరించారు పోలీసులు.