దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ లో కొత్త జోష్ నిండింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏడు మ్యాచుల్లో ఆడనున్నది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్నది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలుకానున్నది.
ఏప్రిల్ 2, 9, 18, 24, మే నెలలో 4, 13, 18 తేదీల్లో మ్యాచ్ లు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ కి టీఎస్ఆర్టీసీ, మెట్రో గుడ్ న్యూస్ లు చెప్పాయి. హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శనివారం తెలిపారు.
అలాగే ఆదివారం జరిగే మ్యాచ్ సందర్భంగా రైళ్ల సంఖ్యను పెంచాలని మెట్రో నిర్ణయించింది. రద్దీ నేపథ్యంలో నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మెట్రో సౌకర్యాన్ని ప్రేక్షకులు వినియోగించుకోవాలని కోరారు.
మరో వైపు ఉప్పల్ మ్యాచ్ కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నగరంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల 340 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
జాయింట్ కమాండ్, కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియాన్ని తెరుస్తామని, నైట్ మ్యాచ్ లు జరిగిన సమయంలో సాయంత్రం 4:30 గంటలకు స్టేడియాన్ని తెరువనున్నట్లు వివరించారు.
స్టేడియంలోకి ల్యాప్ టాప్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, మ్యాచ్ బాక్స్, లైటర్స్, పదునైన ఆయుధాలు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యూలర్స్, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్స్, పర్ ఫ్యూమ్స్, బ్యాగ్స్, తినుబండారాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.