ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. ఇక మూడు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండుగే. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎప్పటిలాగా ఈసారి మ్యాచ్ ఆడబోయేది 8 జట్లు కాదండి.. లఖ్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌లతో కలిపి పది జట్లు ఐపీఎల్ కప్ కోసం తలపడనున్నాయి. దీంతో మ్యాచ్‌లు కూడా పెరిగాయి. అలాగే, ఈసారి 6 జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. వీటన్నింటికీ మించి కరోనా కారణంగా వరుసగా రెండేళ్లు వాయిదాలు పడి.. ఒకసారి పూర్తిగా, ఇంకోసారి సగం సీజన్ విదేశాలకు తరలిన లీగ్.. ఈసారి స్వదేశంలో, షెడ్యూల్ ప్రకారం, అది కూడా అభిమానుల మధ్యే జరగబోతోంది. మరీ నేటి నుంచి ప్రారంభమై ఐపీఎల్ ముచ్చట్లు మీ కోసం..
మరి కొద్దిగంటల్లో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్‌లో అడుగుపెట్టింది. టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీకొట్టబోతోంది. శనివారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే, ఈసారి మ్యాచ్‌ల సంఖ్య కూడా 74కి చేరింది. ఇందులో 12 డబుల్ హెడర్స్ ఉండగా.. శనివారం నుంచి మే 29 వరకూ ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు ఉన్న రోజు.. ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకి, రాత్రి మ్యాచ్ 7.30 గంటలకి ప్రారంభంకానుంది.
అయితే, ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహేంద్రసింగ్ ధోనీ కేవలం వికెట్ కీపర్/ బ్యాటర్‌గా ఆడబోతున్నాడు. ఆ జట్టుని ఈ ఏడాది రవీంద్ర జడేజా కెప్టెన్‌గా నడిపించనున్నాడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ ఉండనున్నాడు. అలానే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది వరకూ శ్రేయాస్ ఢిల్లీ టీమ్‌కి ఆడిన విషయం తెలిసిందే. ఇక కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టన్‌గా వ్యవహరించనున్నారు. పంజాబ్‌ను వీడిన కేఎల్ రాహుల్..లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ తొలిసారి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు.
గతంలో ప్రతి టీం రెండేసి సార్లు తలపడుతూ..మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడేది. ఇప్పుడు పది టీమ్‌లు కావడంతో ఫార్మట్‌లో మార్పులు చేసింది బీసీసీఐ. రెండు గ్రూపులుగా విభజించింది. ఒక్కొక్క టీమ్.. గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు అంటే మొత్తం 8 మ్యాచ్‌లు ఆడుతుంది. మిగిలిన గ్రూప్‌లోని ఒక టీమ్‌తో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడనుంది. ఇక లీగ్ దశలో జరగనున్న 70 మ్యాచ్‌లకీ మహారాష్ట్ర ఆతిథ్యం ఇవ్వబోతోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్‌లో 20, డీవై పాటిట్ స్టేడియంలో 15, పుణెలోని ఎంసీఏ స్టేడియంలో 15 మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం కఠినమైన బయో-సెక్యూర్ బబుల్‌ని బీసీసీఐ ఏర్పాటు చేస్తోంది.