ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమై రెండు వారాలు దాటింది. స్డేడియంలో ఆటగాళ్ల పరుగుల వరద కన్పిస్తోంది. జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. అయితే, ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రావటంతో మొత్తం రూపురేఖలే మారిపోయాయి. ఈ మ్యాచ్‌ల్లో షాకింగ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరుస్తోన్నాయి. అంతేకాదు, కొందరు పాత ఆటగాళ్లు మళ్లీ తమ కీర్తిని చాటుతూ వారి జట్లకు విజయాన్ని అందిస్తున్నారు.
ఇక, ఐపీఎల్ 2022 సీజన్‌లో పది జట్లు ఉండటంతో.. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఇతర జట్లలోకి జంప్ అయ్యారు. దీంతో స్ట్రాంగ్‌గా ఉండే టీమ్స్ బలహీన పడగా.. బలహీనం అనుకున్నా టీమ్స్ ఆటను ప్రదర్శిస్తోన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఐదుసార్లు కప్ గెలిచి స్ట్రాంగ్ అనుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. టీం బలంగానే ఉన్నా, ఆటగాళ్లే సరైన ఆటతీరు కనబర్చడం లేదనే విమర్శలు వినిపిస్తోన్నాయి.
ఇక అటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు సైతం అంతంత మాత్రంగానే ఉంది. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఒక విజయం సాధించింది. రానున్న మ్యాచుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తుందా అంటే చెప్పలేము. అలాగే, అత్యంత బలహీన జట్టుగా ఐపీఎల్ చరిత్రలో ముద్ర వేయించుకున్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఈసారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎస్ఆర్‌హెచ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లో తొలుత రెండు మ్యాచులు ఘోరంగా ఓడినా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాల్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ జట్టులోని ఆటగాళ్లు మెల్లగా ట్రాక్‌లోకి వస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్, కోల్‌కతా జట్లు.. ఎప్పట్లాగే తమ మంచి ప్రదర్శనతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ టీంలు సత్తా చాటుతున్నాయి.
ఈ క్రమంలో గుజరాత్ టీం సునాయాసంగా టాప్-4లో అది కూడా అగ్రస్థానంలో నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కోల్‌కతా, రాజస్థాన్, పంజాబ్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాలకు చేరుకుంటాయని భావిస్తున్నారు. మిగతా జట్ల ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ.. ఈ నాలుగు జట్లు మాత్రం నిలకడగా రాణిస్తుండడం చూస్తుంటే, వీటి మధ్య చివర్లో హోరాహోరీ పోరు కొనసాగనున్నట్టు స్పష్టమవుతోంది.