ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ సజ్జనార్ ఆర్టీసీ డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లతోనే భారీగా ట్రాఫిక్ జాం అవుతాయని, రోడ్డు మధ్యలో బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారని వస్తున్న విమర్శలపై సజ్జనార్ స్పందించారు. ఇక నుండి రోడ్డు మధ్యలో బస్సులు ఆపకూడదని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిబంధనలకు అది విరుద్దమని… ఒకవేళ డ్రైవర్లు రోడ్డు మధ్యలో బస్సు ఆపితే వేసే చలాన్లకు ఆయా డ్రైవర్లే బాధ్యులని, వారి జీతాల నుండే చలాన్లు కట్టాల్సి వస్తుందని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ అయ్యింది.
డ్యూటీ చార్ట్ లు వేసే సమయంలో సూపర్ వైజర్లు, బస్సులు డిపోల నుండి బయటకు వచ్చే సమయంలో డ్రైవర్లకు ఈ సూచనలు కనపడేలా అన్ని అంశాలు డ్రైవర్లకు వివరించాలని సజ్జనార్ ఆదేశించారు.