ఎట్టకేలకు ఇరాన్ నటి తరనేహ్ అలిదస్తీ జైలు నుంచి విడుదలయ్యారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన ఆమెకు అభిమానులు, హక్కుల కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
దీనికి సంబంధించిన ఫోటోలను హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఎజెన్సీ ట్వీట్ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆమెకు అభిమానులు, హక్కుల కార్యకర్తలు, ఆమె సహచరులు పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్నట్టు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది.
దేశంలో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వనికి వ్యతిరేకంగా పౌరులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో నటి అలి దస్తీ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
18 రోజుల తర్వాత తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలైనట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. 2016లో అస్కార్ అవార్డ్ పొందిన ‘ది సేల్స్ మ్యాన్’సినిమాలో అలిదస్తీ నటించారు. గతంలో ఇరాన్ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 600 మంది నటీనటులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు.