ఇరాన్ రక్షణ శాఖ అమ్ముల పొదిలో కొత్త ఆయుధం వచ్చి చేరింది. తాజాగా మరో కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్‌ను ఇరాన్ తయారు చేసింది. సుమారు 1,650 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ మిస్సైల్ అత్యంత సమర్థవంతంగా ఛేదించగలదని ఇరాన్ పేర్కొంది.
పాశ్చాత్య దేశాల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఈ క్షిపణి తమ సైన్యానికి బలం చేకూర్చుతుందని టాప్ కమాండర్ అమిరాలి హజిజాదే వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఈ క్షిపణిని ఉపయోగిస్తామన్నారు.
అమెరికాకు చెందిన సాధారణ సైనికులపై దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించబోమని వెల్లడించారు. 2020లో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇరాన్ మిలటరీ కమాండర్ క్వాసిం సొలెమనిపై అమెరికా డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో క్వాసిం సొలెమని మరణించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ సైన్యం అమెరికాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. డ్రోన్ దాడికి కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పలు మార్లు హెచ్చరించింది. తాజాగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చడమే తమ లక్ష్యమని హజీజాదే ప్రకటించారు.