పాట్నా-ఢిల్లీ స్పైస్ జెట్ విమానం (బోయింగ్ 737-800) ఆదివారం టేకాఫ్ అయిన వెంటనే మంటలు వ్యాపించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు మొదట వాటిని గమనించి అధికారులకు సమాచారం అందించారు.
విమానాన్ని పక్షి ఢీకొట్టిందని, ఒక ఇంజన్ షట్ అవ్వడం వల్లే మంటలు వ్యాపించాయని డీజీసీఏ తెలిపింది. విమానంలో 180 మందికి పైగా ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఈ విషయం గురించి డీఎం చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ.. * విమానంలోని మంటలను మొదట స్థానికులు గమనించి జిల్లా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఢిల్లీకి బయల్దేరిన విమానం తిరిగి పాట్నా విమానాశ్రయానికి వచ్చింది. ఇందులో ప్రయాణిస్తున్న 185 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం అయి ఉండొచ్చని అధికారులు తెలిపారని* ఆయన అన్నారు.
విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ ను పక్షి ఢీకొట్టినట్లు కాక్‌పిట్ సిబ్బంది గమనించినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. వెంటనే ప్రభావితమైన ఇంజిన్ ను మూసివేసి పాట్నాకు తిరిగి వెళ్లాలని కెప్టెన్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానాశ్రయానికి చేర్చినట్లు పేర్కొన్నారు.