భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో క్యాండీ టస్కర్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ జట్టు తాజాగా జాఫ్నా స్టాలియన్స్‌తో తలపడగా అందులో పఠాన్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. టీ20లలో 2000 వికెట్లు తీయడంతోపాటు 150 వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటి వరకు టీ20లలో 173 వికెట్లు తీశాడు. 2వేల పరుగులు చేసేందుకు అతనికి 142 ఇన్నింగ్స్ పట్టింది. కాగా తాజాగా జరిగిన ఎల్‌పీఎల్ మ్యాచ్‌లో పఠాన్ 19 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో క్యాండీ టస్కర్స్ జట్టు స్టాలియన్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే ఎల్‌పీఎల్‌లో ఇప్పటి వరకు ఇర్ఫాన్ పఠాన్ 4 మ్యాచ్‌లు ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇర్ఫాన్ పఠాన్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన పఠాన్ పలుసార్లు ఆల్ రౌండర్‌గా కూడా అదరగొట్టాడు. 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించి టీమిండియా తరఫున 2012 వరకు ఆడాడు. పఠాన్ మొత్తం 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. సౌతాఫ్రికాలో 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో ఇండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, హైదరాబాద్, చెన్నై, పూణె, గుజరాత్ జట్లకు ఆడాడు. ఐపీఎల్‌లో చివరిసారిగా అతను 2017లో కనిపించాడు.