కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆర్థికంగా ఆదుకునేందుకు బైడెన్ సర్కార్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. దాదాపు 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉపశన ప్యాకేజీపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. దాంతో ఈ బిల్లు ఫలితాలు అమెరికన్ పౌరులకు అందుతున్నాయి.
ఈ ప్యాకేజీ ద్వారా 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందనున్నాయి. ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు భారతీయ కరెన్సీలో లక్ష రూపాయలకు సమానంగా జమ చేయనున్నారు.దీంట్లో భాగంగా శుక్రవారం నుంచి ఫస్ట్ బ్యాచ్‌కు 1400 డాలర్ల పంపిణీని ప్రారంభించినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ వెల్లడించింది.
ఈ మొదటి బ్యాచ్ పేమెంట్లను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఐఆర్‌ఎస్ పేర్కొంది. ఈ వీకెండ్స్ లో వారి ఖాతాల్లో సొమ్ము జమ అవుతాయని తెలిపింది. ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు.. నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున భృతి.. కరోనా వ్యాక్సిన్, టెస్టుల కోసం మరో 50 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు.
బైడెన్ ఈ నిర్ణయంపై పున సమీక్షించాలన్న డిమాండ్లు కూడా వచ్చినప్పటికీ… అమెరికన్ పౌరులను ఆదుకోవాల్సిందేనంటూ ప్యాకేజీ ఇచ్చేందుకే ఆయన మొగ్గుచూపారు.