దళిత బంధుతో హుజురాబాద్‌ను గెలుచుకునే ప్లాన్ వేసిన గులాబీబాస్‌కు.. ఆ వెంటే కొత్త సవాళ్లూ ఎదురవుతున్నాయి. అంబేద్కర్ వారుసుడు వచ్చాడని కేసీఆర్‌ను టీఆర్ఎస్ నేతలు ఆకాశానికి ఎత్తుతున్న వేళ.. ఆ బిరుదును సార్థకం చేసుకోవాలంటే మరో పని కూడా చేయాల్సి ఉందని దళిత సంఘాలు, ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకున్నాయి. దళిత సంక్షేమం గురించి వల్లె వేస్తున్న కేసీఆర్.. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దళితులపై కేసీఆర్‌కు చూపించే ప్రేమ నిజమే అయితే.. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే ఆ పనిచేయాలని గొంతెత్తుతున్నాయి.
ఈటల బర్తరఫ్ తర్వాత.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన అవసరం ఉండిపోయింది. కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక బిజీలో పడి కేసీఆర్ ఆ విషయాన్ని పక్కనబెట్టారు. అయితే ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజులకైనా మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణ జరపాల్సి ఉండటంతో.. దళిత వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకం విజయవంతం కావాలంటే.. ఆ పథకాన్ని నిరంతరం సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒకరు బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని… కాబట్టి దాన్ని దళిత డిప్యూటీ సీఎంకు అప్పగిస్తే మంచిదని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రి పదవిని.. దళిత వర్గానికి కేటాయించి, అదే నేతను డిప్యూటీ సీఎంగా చేయాలని వారు కోరుతున్నారు. లేదా ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న కొప్పుల ఈశ్వర్ కు ఇచ్చినా అభ్యంతరం లేదని అంటున్నారు.
దళితులకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన ప్రయోజనాలు దక్కలేదని, గ్రామాల్లో ఇంకా ఊరవతలే ఉండిపోయారని చెబుతున్న ముఖ్యమంత్రి.. ప్రభుత్వంలో కూడా వారిని దూరం పెట్టొద్దని దళిత సంఘాలు కోరుతున్నాయి. జనాభా ప్రతిపాదికన కూడా చూసినా ఎస్సీల నుంచి కనీసం ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ఉండాలని.. కానీ కొప్పుల ఈశ్వర్ ఒక్కరు మాత్రమే ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో కనీసం మరో మంత్రి పదవి అయినా ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దళితుడిని సీఎంగా చేస్తానని ఎలాగూ మాటతప్పిన కేసీఆర్..కనీసం డిప్యూటీ సీఎం ఇచ్చి అయినా కొంతలో కొంత ఆ తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇటీవల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఈ మాటలు అన్న తర్వాత.. ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది.
వాస్తవానికి టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో దళిత వర్గానికి చెందిన టి.రాజయ్య కొన్నాళ్లు, ఆ తర్వాత కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. కానీ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చే సాంప్రదాయాన్ని పక్కనబెట్టారు. ఇప్పటివరకు దీని గురించి పెద్దగా ఎవరూ మాట్లాడలేదు కానీ.. సీఎం కేసీఆర్ త్వరలో తన కేబినెట్లో మార్పులు, చేర్పులు చేయబోతన్నారనే చర్చ జరుగుతుండటంతో.. మళ్లీ డిప్యూటీ సీఎం డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే బీసీ వర్గానికి చెందిన ఈటలను బహిష్కరించడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోనే ఆ ప్లేస్‌ను కేసీఆర్ భర్తీ చేస్తారనే ప్రచారం ఉంది. కేసీఆర్ మంత్రివర్గంలో మొత్తం నలుగురు బీసీ మంత్రులు ఉండేవారు. ఈటల బర్తరఫ్‌తో ఆ సంఖ్య మూడుకు ( తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల ) దిగొచ్చింది.
ఇక మిగిలిన వారి విషయానికి వస్తే.. కమ్మ (పువ్వాడ అజయ్ కుమార్), ఎస్టీ (సత్యవతి రాథోడ్), ఎస్సీ (ఈశ్వర్) ముస్లిం ( మహమూద్ అలీ) వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. వెలమ సామాజిక వర్గంలో కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మొత్తం ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. దీంతో ఎస్సీలకు మరో మంత్రి పదవి, అలాగే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే సరైనదన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.