కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి పార్టీ మార్పు ప్రచారం రోజుకో టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతలు అలాంటిదేం అని కొట్టిపారేస్తోంటే..రాములమ్మ రాజకీయం మాత్రం ఇంకా అనుమానాలకు తావిస్తూనే ఉంది. తాజాగా విజయశాంతి కాంగ్రెస్‌ని వీడుతున్నారనే ప్రశ్నపై రాష్ట్ర ఇంచార్జ్ ఠాగూర్ స్పందించారు. ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నారని.. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. కానీ విజయశాంతి మాత్రం ఉదయం చేసిన ట్వీట్ మాత్రం మరోలా ఉంది.
పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… టీఆర్ఎస్‌పై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలేమో తీవ్రంగా ఖండిస్తుండగా.. ఆమె మాత్రం వాటిని సమర్థిస్తూ పోస్ట్ పెట్టారు. మాట వరుసకు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. ఇటీవల ఆమె ట్వీట్లు మాత్రం బీజేపీకి సపోర్ట్ చేసేలానే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు సేమ్ డిస్టన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్న తీరు చూస్తోంటో… రెండు పార్టీల్లోనూ ఆమె డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నట్టున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.