సమ్మెను సాకుగా చూపిస్తూ… ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలు మొదలయ్యాయా…? ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెను బూచీగా చూపుతూ అద్దె బస్సులను ప్రభుత్వం హైర్ చేస్తుందా…? తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత అద్దె ప్రకటలు ఎందుకు?
సీఎం కేసీఆర్ ప్రకటనకు అధికారులు కార్యరూపం ఇస్తున్నారు. దాదాపు 30శాతం వరకు ఆర్టీసీలో అద్దె బస్సులను ప్రవేశపెట్టాలనే యోచనకు కార్యచరణ సిద్ధమైంది. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని హైకోర్టు ఇచ్చిన సూచన పేరుతో… అద్దె బస్సులను శాశ్వత ప్రాతిపదికన ఇచ్చేందుకు ప్రకటన విడుదలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు కోర్టు తలుపు తట్టాయి.
ఆర్టీసీ బోర్డు లేకుండా ఇంచార్జీ ఎండీ టెండర్లు పిలవటం చట్ట విరుద్దమంటూ కోర్టును ఆశ్రయించాయి కార్మిక సంఘాలు. ఆర్టీసీ బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కోర్టు సూచన మేరకే ఇలా చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కావని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ పిటిషన్‌ను కూడా అన్ని పిటీషన్లతో కలిసే 28న వింటామని హైకోర్టు వాయిదా వేసింది.
ఓవైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా, 50వేల కుటుంబాలు పస్తులుంటున్నా… ప్రభుత్వానికి, కేసీఆర్‌కు చీమ కుట్టినట్లుగా కూడా లేదని కార్మికులు మండిపడుతున్నారు. గతంలో చడీచప్పుడు కాకుండా ప్రైవేటు పరం చేస్తే, ఇప్పుడు మరింత మొండిగా బహిరంగంగానే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.