కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో ప్రగతిభవన్ పోలీసు అధికారుల్లోనూ అసంతృప్తికి దారితీసిందా…? ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తుందా…? అధికారులపై పక్షపాతం కొనసాగుతోందా…?
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ చలో ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిని ఫక్కీలో ప్రగతిభవన్‌కు చేరుకొని, గేటు ముందు నిలబడి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సహా ఏ ఒక్కరిని ప్రగతిభవన్ దరిదాపుల్లోకి రానివ్వకూడదని పోలీసులకు ప్రభుత్వం నుండి ఆదేశాలున్నాయి. అయినా… రేవంత్ పోలీసుల కళ్లు గప్పి ప్రగతి భవన్ చేరుకున్నారు.
అయితే, రేవంత్ తన ఇంట్లో నుండే బయటకు వచ్చి, బైక్‌పై ప్రగతి భవన్ వచ్చే వరకు పోలీసులు రేవంత్‌ను అదుపులోకి తీసుకోలేదు. అయితే, ప్రగతి భవన్ వద్ద బందోబస్త్ ఇంచార్జీగా ఉన్న ఏసీపీ నర్సింహరెడ్డిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. కానీ రేవంత్ ఇంటి వద్ద బందోబస్తు చూసుకునే బంజారాహిల్స్ ఏసీపీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ ప్రగతిభవన్ అధికారి కన్నా రేవంత్ ఇంటి దగ్గర బందోబస్త్ చూసుకునే అధికారి వైఫల్యమే ఎక్కువగా ఉన్నా… ఓ సామాజిక వర్గం అధికారిపై చర్యలు తీసుకొని, తమ సామాజిక వర్గం అధికారిపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.