దేశంలో ద్వేషాన్ని రెచ్చగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీయేనని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇండియాలో పరమత అసహనం పెరిగిపోతోందని మీరు ప్రచారం చేస్తూ ఈ దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని ఆయన విమర్శించారు. మధ్యప్రదేశ్ లో ఆదివారం జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. రాజకీయ ద్వేషాన్ని నివారించేందుకే తాము భారత్ జోడో పాద యాత్రను చేబట్టామన్న రాహుల్ వ్యాఖ్యను తప్పు పట్టారు.
ఈ దేశంలో ఇలాంటి ద్వేషానికి ఆజ్యం పోసిందెవరని ప్రశ్నించారు. మన సాయుధ దళాల ధైర్య సాహసాలపై మీరు, మీ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఇండియా చీలిపోయిందా ? ఈ దేశాన్ని సమైక్యపరిచేందుకే జోడోయాత్ర చేబట్టానని మీరు చెబుతున్నారు అని కూడా రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
1947 లోనే ఈ దేశ విభజన జరిగిందని, ఇకపై ఇలా విభజన ప్రసక్తే ఉండదని ఆయన చెప్పారు. ఈ దేశంపై పెత్తనం మాదేనని ఎవరూ అనడానికి కూడా సాహసించరని అన్నారు. భారత దేశ ప్రతిష్టను నీరు గార్చకండి.. రాజకీయాలన్నవి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికే కాదు.. సమాజాలను సృష్టించడానికి కూడా అని ఆయన వ్యాఖ్యానించారు.
అవినీతి పూర్తిగా అంతం కాలేదని, కానీ ప్రధాని మోడీ ప్రభుత్వం దీన్ని అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుందని రాజ్ నాథ్ చెప్పారు. ఇప్పుడు ఇండియా అతి పెద్ద ఎకానమీ గల దేశంగా మారిందన్నారు. 2047 నాటికి ఇండియా ధనిక దేశంగా మారుతుందన్న విశ్వాసం తనకుందని ఆయన పేర్కొన్నారు.