ఇప్పటి క్రికెట్ అంపైర్ లు అంటే పెద్దగా జనాలకు పరిచయం లేదు గానీ… ఒకప్పటి అంపైర్ ల కోసమే క్రికెట్ మ్యాచ్ లు చూసే వాళ్ళు అభిమానులు. సైమన్ టఫెల్, బిల్లీ బౌడెన్, అలీం దార్ సహా పలువురు అంపైర్ లు అలా గుర్తుండిపోయారు. ఇక అంపైరింగ్ లో ప్రత్యేకత సంపాదించుకున్న వారిలో బౌడెన్ ముందు వరుసలో ఉంటారు. ఆయన శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. సిక్స్ కొట్టినప్పుడు ఆయన చేతులు లేపే విధానం, ఫోరు కొట్టినప్పుడు ఇచ్చే సిగ్నల్ ఇవన్నీ ఒక సంచలనం.
ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ఆయన అసలు పేరు బ్రెంట్ ఫ్రేసెర్ బౌడెన్. ఫాస్ట్ బౌలర్ గా క్రికెట్లో కెరీర్ మొదలుపెట్టినా, 20 వ ఏట రుమటాయిడ్ ఆర్త్రిటీస్ అనే వ్యాధి బారిన పడ్డారు ఆయన. ఆ వ్యాధి ఉన్న వారు శరీరంలోని జాయింట్లను సులభంగా కదపలేరు. ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పి అంపైరింగ్ కు వచ్చారు. ఆ తరువాత, 1995 లో మొదటి వన్-డే అంతర్జాతీయ మ్యాచ్ లో, 2000 లో టెస్ట్ మ్యాచ్ కు అంపైరింగ్ చేసారు.
వ్యాధిని ఈయన తనకు అనుకూలంగా మార్చుకుని మంచి ప్రత్యేకత సంపాదించుకున్నారు. జాయింట్ కధపలేకపోయినా శరీరం మొత్తం కదిపే వారు. 2002 లో ఆయన్ను ఐసీసీ అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్ లోకి చేర్చారు. ఆ తరువాత 2003 లో ఐసీసీ ప్యానెల్ ఆఫ్ ఎలైట్ అంపైర్స్ లో ఆయనకు స్థానం రాగా… 2016 వరకు తన కెరీర్ కొనసాగించారు. ఫుట్బాల్ తరహాలో ఆటగాడికి రెడ్ కార్డు చూపించి షాక్ ఇచ్చారు. ఆయన అభిమానులకు పంచే వినోదం కోసమే వెళ్ళే వారు ఫాన్స్ మ్యాచ్ లకు.