వంట చేసే విషయంలో చిన్న చిన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. చిన్న విషయాలను తెలుసుకుని వంట పాత్రలను ఉపయోగించాల్సి ఉంటుంది. వేడి వేడి పాత్రలపై నీళ్ళు పోస్తూ ఉంటారు. ఉదాహరణకు పాన్ ను తీసుకుంటే… దానిపై ఆమ్లెట్ వేసినప్పుడు లేదా ఏదైనా వేయించిన వెంటనే తీసుకెళ్ళి టాప్ కింద పెడతారు. ఇలా చేయడం కరెక్టా అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు కరెక్టా కాదా అనేది తెలుసుకుందాం.
చాలా వేడిగా ఉండే ఇనుప లేదా స్టీల్ వస్తువులను వెంటనే చల్లబరిస్తే వాటిలో అంతర్గత ఒత్తిడి ఏర్పడుతుంది. సాధారణంగా వస్తువులను వేడి చేస్తే అవి ఉన్న పరిమాణం కంటే కూడా పెద్దవి అవుతాయి. వెంటనే చల్లబరిస్తే సంకోచించబడతాయి. చాలా వేడిగా ఉన్న వాటిని వెంటనే చల్లబరిస్తే ఒకేసారి విస్తరణలో ఉన్నవి వెంటనే సంకోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వస్తువులకు ఒక నిర్దిష్ట పరిమాణం ఉంటుంది.
ఈ విస్తరణ-సంకోచన వలన అవి షేప్ అవుట్ కాకుండా ప్రయత్నం చేస్తాయి. దీనితో ఈ అంతర్గత-ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ పదే పదే కొనసాగితే ఏదొక సమయంలో ఆ వస్తువు మీద పగుళ్లు ఏర్పడతాయి. వేడి ప్యాన్ లేదా వంట పాత్రల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక్కసారిగా వేగంగా చల్లబడడంతో ఆ పాత్రల్లో అంతర్గత ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రతిసారి అలానే చేస్తే ఏదొకరోజు ఆ పాత్రల మీద పగుళ్లు ఏర్పడతాయి. పాన్ లను సాధారణంగా పెలుసు పదార్దాలతో తయారు చేస్తారు కాబట్టి ఇటువంటి వాటిని అవి ఎక్కువ కాలం తట్టుకోలేవు. అవి వాటంతట అవే చల్లబడే వరకు ఎదురు చూడాలి.