– జూబ్లీహిల్స్ సొసైటీలో టార్గెట్ ఎవరు?
– అక్రమాలపై దర్యాప్తులో ఏం తేల్చనున్నారు?
– వీర బ్రహ్మయ్య భవిష్యత్ వాణి ఎంటి?
– ఈనెల చివరి వరకు ఎవరెంత పలుకునో!
– సేఫ్ గా బయటపడేందుకు ఇరు కమిటీల పాట్లు
క్రైంబ్యూరో, తొలివెలుగు:జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో బడాబాబుల అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సెక్షన్ 51 ప్రకారం సొసైటీ రిజిస్ట్రార్ అండ్ కమిషనర్ దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త పాలక మండలి, పాత కమిటీలు చేసిన అవినీతి, అక్రమాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. కమిషనర్ వీర బ్రహ్మయ్య ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈలోపు లెక్క తేలనుందని అనుకుంటున్నారు సభ్యులు. అయితే, ఆ అధికారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వద్ద రిపోర్టు ఉంది. దర్యాప్తులో వారికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వకుండా ఇరు వర్గాలు భారీగానే ముడుపులు అప్పగించాయని వినికిడి. రెండు సైడ్స్ నుంచి బాగా లాగేసి.. ఎవరు ఎక్కువ ఇస్తే వారికి హెల్ప్ చేస్తారనే చర్చ సాగుతోంది. గతంలో ఎన్నో సొసైటీల దర్యాప్తులో ఇలాగే చేశారని ప్రచారం జరుగుతోంది. ఎవరిని సేఫ్ జోన్ లోకి నెట్టేస్తారు.. ఎవరిని రోడ్డుపై నిలబెడతారో నివేదిక సమర్పించేంత వరకు సస్పెన్స్ తప్పదు.
శాతాలు ఎక్కడా తగ్గలే!
రూ.2 లక్షల కోట్ల విలువ చేసే భూములను అప్పట్లో ప్రభుత్వం అప్పగిస్తే.. రియల్ భూం వచ్చాక కొంతమంది కబ్జా తెలివితేటలతో వేల కోట్లు సంపాదించారు. ఇవన్నీ అక్రమాలేనని తొలివెలుగు బట్టబయలు చేసింది. 1990 నుంచి అక్రమాలు జరిగాయి. మొదటి అధ్యక్షుడి నుంచి సత్యనారాయణ హయాం వరకు ఎలాంటి అవకతవకలు జరగలేదు. టీఎల్ ప్రసాద్, ఎన్ఏ చౌదరిల సమయంలో అక్రమ కేటాయింపులు జరిగాయని ఆరోపణలు మొదలయ్యాయి. అందుకు స్పెషల్ ఆఫీసర్ కూడా నియమించారు. ఆ తర్వాత కృష్ణమూర్తి ఫర్వాలేదు కానీ, 2005 నుంచి 2020 వరకు పని చేసిన తుమ్మల నరేంద్ర చౌదరి, ఏడాదిన్నరకు పైగా పని చేస్తున్న బీఆర్ నాయుడుపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఇద్దరి ప్రెసిడెంట్ల కమిటీల తీరుపై సొసైటీ యాక్ట్ 1964, సెక్షన్ 51 ప్రకారం దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్. ఈ క్రమంలోనే ఓ స్పెషల్ ఆఫీసర్ ని నియమించారు. 15 ఏళ్లలో నరేంద్ర చౌదరి చేసిన అక్రమాలపై ఇప్పటికే కొన్ని దర్యాప్తు సంస్థలు నివేదికలు పొందుపర్చాయి. 2013 వరకు జరిగినవన్నీ రిపోర్ట్ చేశాయి. ఆ తర్వాత జరిగిన అవినీతి ఇప్పుడు తేల్చనున్నారు. అయితే, కొత్త కమిటీ కూడా పాత పాలక మండలిలా.. సొంత నిర్ణయాలు తీసుకొని కొంతమందికి లబ్ది చేకూరేలా చేసిందనేది ఆరోపణ. అందుకు చిరంజీవికి అదనంగా భూమి అప్పగించడం.. కుర్ర శ్రీనివాస్ బంధువులకు ల్యాండ్ ఇవ్వడం.. గ్రీన్ కో కి ఇచ్చిన లీజ్ లో అక్రమాలు జరిగాయని చెబుతూనే దాన్నే కొనసాగించడం.. నర్సరీ ల్యాండ్ వివాదం.. ఇలా ఒక్కొక్కటి ఇంటర్ లింక్ అయ్యి ఉన్నాయి.
ఉచ్చు బిగుస్తోంది..!
సొసైటీలో పని చేసిన పాలక సభ్యులకు ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. అక్రమాలు జరిగాయని కళ్ల ముందే కనిపిస్తోంది కానీ, చర్యలు మాత్రం శూన్యంగా ఉంది. కిరణ్మయి లాంటి అధికారిణి.. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టీఎన్జీవో, అయ్యప్ప సొసైటీల అక్రమాలపై నివేదిక ఇస్తే.. ఇప్పటికీ చర్యలు లేవు. చిత్రపురి కాలనీలో రూ.110 కోట్ల అవినీతి జరిగిందని దర్యాప్తు ద్వారా తేల్చి.. క్రిమినల్ కేసులు పెట్టకుండానే వదిలేశారు. రూ.300 కోట్ల స్కాం జరిగిందని ఆధారాలతో సహా పట్టి ఇచ్చినా.. 700 మంది దొంగ ఓటర్లు ఉన్నారని వాళ్లే చెప్పినా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే, జూబ్లీహిల్స్ సొసైటీ విషయంలో మాత్రం ఉచ్చు బిగిసేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయనే చర్చ సభ్యుల మధ్య సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో మీడియాలో తమను ఎక్కడా తక్కువ కాకుండా చూపించేందుకు ఇరువురి జుట్లను చేతిలో పెట్టుకునేలా నివేదిక ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే, ఇదే అదునుగా మిగతా పార్టీలు అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
ప్రతీకారం కాస్తా.. పరువు పోయేదాకా..!
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, నువ్వంటే నువ్వని కత్తులు నూరుకున్న వారు… ఇప్పుడు పరువు ఎక్కడ పోతుందోనని లోలోపల మదనపడుతున్నారు. అక్రమాల్లో కొంచెం ఎక్కువ తక్కువ అన్నట్లు ఉంది వ్యవహారం. ఎవరొచ్చినా.. సభ్యులకు మేలు చేయడం కంటే బిజినెస్ పర్పస్ లోనే ఆలోచిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఈ క్రమంలోనే మార్చి 23న ఇరు కమిటీల అక్రమాలపై దర్యాప్తు ఆదేశాలు రావడంతో అరుణ దేవి గణేష్ ని దర్యాప్తు అధికారిణిగా వేశారు. ఇరు ఫిర్యాదులపై మరి కొద్ది రోజుల్లోనే తుది నివేదిక తయారు కానుంది. ఆ దిశగా క్రిమినల్ కేసులు పెట్టే అధికారం సొసైటీ అధికారులకు ఉంది.
సొసైటీ అవసరమే లేదు!
ఆసియాలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని రద్దు చేయాలి. ఇలా ఎన్ని కొత్త కమిటీలు వచ్చినా అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా వచ్చే వారు సభ్యులకు భూములు ఇవ్వలేరు. ఉన్న రోడ్లను, పార్క్ లను బాగు చేసుకునేలా వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పాటు చేయించి.. మిగతా ఓపెన్ స్పేస్ లన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే అవినీతి, అక్రమాలు ఆగిపోయే అవకాశం ఉంది. లేదంటే ఆరోజు నరేంద్ర చౌదరి, ఈరోజు బీఆర్ నాయుడు, రాబోయే రోజుల్లో మరో చౌదరి లేదా రెడ్డి వచ్చి అక్రమాలకే పాల్పడే అవకాశాలు లేకపోలేదు. వంద గజాల భూమిపై తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. 4 కోట్ల రూపాయల అవినీతి జరిగే ఆస్కారం ఉంది. సో.. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి సొసైటీని రద్దు చేసి తప్పుచేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సభ్యులు కోరుకుంటున్నారు.