– లిక్కర్ స్కాంలో అరెస్ట్ తప్పదా
– నెక్ట్స్ ఆమెనే అంటున్న అధికారులు.?
– పరిస్థితి ఎలా ఉండబోతోంది
– కేసీఆర్ ఏం చేయబోతున్నారు. ?
తొలివెలుగు క్రైం బ్యూరో..
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ సంచలనంగా మారింది. ఇప్పుడంతా ఆయన అరెస్టు పైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సీబీఐ నెక్ట్స్ టార్గెట్ ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సిసోడియా తర్వాత ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తధ్యమంటూ ఎప్పటి నుంచో అంతా చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలో సిసోడియా అరెస్టుతో ఈ చర్చ మరోసారి ఊపందుకుంది. సిసోడియా ఎపిసోడ్ తర్వాత కవితను ఈడీ అరెస్ట్ చేయనుందని అంతా అనుకుంటున్నారు. టెండర్ల తయారీలో మంత్రి పాత్ర ఉంటే ఇటు ఆర్ధిక లావాదేవీల్లో కవిత పాత్ర ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే నిందితుల రిమాండ్ రిపోర్టులో, చార్జీషీట్లలో కవిత పేరును ఈడీ 80 సార్లు ప్రస్తావించింది. ఈ కేసులో కవిత సాక్షిగా ఉండబోతున్నారా…? లేదా నిందితులుగా ఉంటారా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. కానీ ఈ కేసులో సిసోడియా పేరు తర్వాత ఎక్కువ సార్లు వినిపించిన పేరు కవితదే.
ఈ క్రమంలో అమెను ఈడీ విచారించనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అప్పట్లో కరుణానిధి కూతురు కనిమొళిని ఈడీ ఏవిధంగా అరెస్ట్ చేసిందో ఇప్పుడు కవితను అలాగే అరెస్ట్ చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రం పై యుద్దం ప్రకటించారు.
కవిత అరెస్ట్ ఉంటే ఎలా ఎదుర్కోవాలో పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ఇదే కీలక పరిణామంగా ఆయన పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. ఊహలకు అందని విధంగా నేషనల్ పాలిటిక్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం.