ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ప్రమోషన్ దక్కబోతోందా? కేబినెట్‌లో చేరాలన్న కల తీరబోతోందా? విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కవిత.. విస్తృత పర్యటనలు చేయడానికి గలకారణమేంటి? అన్న, నాన్నపై అలకబూనిందని చెప్పుకుంటున్న ఆమెకు ఎట్టకేలకు ఆడబిడ్డ కట్నం అందబోతోందా? అంటే సమ్‌థింగ్ లైక్ దట్ అంటున్నారు విశ్లేషకులు.నిజామాబాద్ జిల్లాలో కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె తిరిగి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు షురూ కూడా చేశారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అటు ఇవన్నీ చూసి ఏదో జరుగుతోందని, కవితకు పార్టీలో మళ్లీ పెద్దపీటే దక్కబోతోందని అంచనాతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు.. గతంలోలా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరుగా వరుసబెట్టి భేటీ అవుతున్నారు. కవిత విషయంలో గత సంప్రాదాయాలను, ప్రోటోకాల్‌ను మళ్లీ పాటించడం మొదలుపెట్టారు.
ఆర్టీసీ చైర్మన్‌గా ఎంపికైన ఎమ్మెల్యే బాజీరెడ్డి.. ఇటీవలే కవిత ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలోనూ ఆమెను ఆహ్వానించారు. ఇక టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎన్నికైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా కవితను కలిశారు. జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా మళ్లీ గతంలోలా పలకరింపులు మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తోంటే కవితకు ఈసారి కేబినెట్‌లో బెర్త్ కన్ఫామ్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయమే ఉండటంతో.. పునర్ వ్యవస్థీకరణ తప్పదని, అందులో కవితకు చోటు ఖాయమని అంటున్నారు. ఆ సంకేతాలు రావడంతోనే ఆమె మళ్లీ పార్టీ బలోపేతం దిశగా గట్టిగా అడుగులు వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.