తోకే కుక్కను ఆడిస్తుంది! అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా!
ముమ్మాటికీ ఇది సాధ్యమే అని రుజువు చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు.
హుజుర్ నగర్ ఎన్నికలలో సీపీఐ మద్దతు కోరడం ద్వారా ఇది సాధ్యమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో వామపక్షాలను తోక పార్టీలు అంటూ విమర్శలు చేసిన కేసీఆర్ తెలంగాణా వచ్చి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏ పార్టీనీ, ఎవరినీ లెక్కచేయలేదు. ఏవరి మద్దతూ మాకు అవసరం లేదు, టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. అంటూ కేసీఆర్ అన్న మాటల్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏ బై ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసింది. ఆఖరికి మున్సిపల్ ఎన్నికలు కావొచ్చు.. జడ్పీటీసీ, ఏంపీటీసీ ఎన్నికలు కావొచ్చు, ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసింది. మరి ఇప్పుడు ఎందుకు సీపీఐ మద్దతు కోరుతున్నట్లు ? హుజుర్ నగర్ ఉపఎన్నికలలో తోకలే తలలను ఆడిస్తున్నాయని కేసీఆర్ గుర్తించి ఉంటాడని అందుకే సీపీఐ మద్దతు అడిగి ఉంటాడని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లడే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ కుక్క తోకను ఆడిస్తుందా… తోక కుక్కను ఆడిస్తుందా అని అన్నారు. అంటే ఉద్యోగులు ప్రభుత్వాన్ని నడపరు, ప్రభుత్వమే ఉద్యోగులను నడిపిస్తుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇది నిజమే! ఉద్యోగులు అవసరం ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం అవసరమే ఉద్యోగులకు కావాలని చెప్పే ప్రయత్నం చేశాడు అని విశ్లేషణ చేస్తున్నారు. మరి హుజుర్ నగర్ ఉపఎన్నికలలో అధికార పార్టీకి తోక పార్టీ అయిన సీపీఐ మద్దతు ఎందుకు అవసరం అయినట్లు? ఇప్పటిదాకా ఏ పార్టీ అవసరం మాకులేదు అన్న కేసీఆర్ ఇప్పుడు సీపీఐ మద్దతు అడుగుతున్నడంటే అప్పుడప్పుడు తోకలు కూడా తలను ఆడిస్తాయని కేసీఆర్ గుర్తిచ్చినట్లేగా అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి కుక్క-తల అన్న సామెత చెప్పి వామపక్షాలు తోక పార్టీలు అంటూ విమర్శలు చేసిన కేసీఆర్‌కు ఇంత త్వరలో సీపీఐ మద్దతు కోరాలిసి రావడం పెద్ద తలనొప్పి అయ్యింది.