అర్జెంటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుగారికి సలహాదారులుగా ఎవరున్నారో కనుక్కుని.. నాలుగు రూపాయలు ఖర్చెక్కువైనా వాళ్లని మీకు కూడా సలహాలు ఇవ్వాలని అడుక్కోవడం బెటర్. అంతలా రాజుగారు చెడుగుడు ఆడేసుకుంటున్నారు రోజూ. ఆయనంత సూటిగా, ఘాటుగా ఏ నేత మాట్లాడలేకపోతున్నారు. ఒకాయన గంట జూమ్ లో మాట్లాడితే.. ఆయన చెప్పినదాంట్లో అవసరమైంది వెతుక్కోవడానికి మరో గంట పడుతుంది. ఇంకొకాయన ప్రెస్ మీట్ పేజీలకు పేజీలు పార్టీ పేరుతో రిలీజ్ చేస్తే.. ఆయన చెప్పింది ఏంటో అర్ధం చేసుకోవడానికే గంటలు పడుతున్నాయి. అలాంటివారి మధ్య రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడిన మాటలు వింటుంటే .. అబ్బ ఏం చెప్పాడు అనిపిస్తుంది.
నిజానికి రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరాలని ప్రయత్నిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయోధ్య దగ్గర నుంచి అన్ని రకాల బిస్కెట్లను కమలాధినేతలకు విసురుతున్నారన్న సంగతి చూస్తూనే ఉన్నాం. మూడు రాజధానులపై మూతి తిప్పుకోవడం తప్ప.. మరేమీ చేయకుండా.. కథలు చెబుతున్న కమల నేతలను సైతం ఆశ్చర్యపర్చేలా రాజుగారు చెలరేగిపోతున్నారు. ఆయన మాటలు చూస్తుంటే.. ఎలాంటి డౌట్లు లేకుండా.. సూటిగా సబ్జెక్టు మీద దూసుకుపోతున్నట్లే అనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ న్యాయపోరాటం కాదు.. రాజకీయ పోరాటం చేయాలి అని డైరెక్టుగా వేసేశారు రాజుగారు. టీడీపీకి సైతం అదే సలహా ఇచ్చారు. అమరావతి మహిళలకు సైతం బూస్ట్ లాంటి ఉపన్యాసమే ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని.. అందరూ పోరాడాలని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదల చూసి నేర్చుకోవాలని కూడా చెప్పారు. ఒకపక్క చంద్రబాబుగారేమో కన్నీరొస్తుందంటూ ఆవేదన పెంచేలా మాట్లాడుతున్నారు. మరోపక్క పవనేమో తాను బ్రహ్మంగారి కంటే గొప్పగా అన్నీ ముందే చెప్పానని మాట్లాడుతున్నారే తప్ప.. తానేం చేస్తాడో.. ఎలా చేస్తాడో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా టీడీపీ వైసీపీ కలిపి మరీ తిడుతూ.. మిత్రుడు బిజెపిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.
ఇలాంటి వారి మధ్య రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే.. నిజమే కదా.. అనిపిస్తుంది. మూడు రాజధానులు కాదు.. నాలుగు జోన్లు అనే కాన్సెప్టే అధికార వికేంద్రీకరణ అని ఏ మాత్రం సందేహించకుండా చెప్పేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు విషయాలు తెలుసుకుంటే మంచిదని.. లేదంటే నష్టపోతారని చెప్పేశారు. ఇలా మాట్లాడుతున్న రాజుగారిని చూసి.. అలా మాట్లాడుతున్న బాబు, పవన్ లని చూస్తుంటే… ఆయన దగ్గర వీళ్లు ట్రైనింగ్ కి వెళితే బెటరేమో అనిపిస్తోంది.