బిజెపియే సేఫ్ గేమ్ ఆడుతుందనుకుంటే.. జనసేన వారిని మించిపోయింది. పవన్ కల్యాణ్ కు అయితే లౌక్యం బాగా ఎక్కువైంది. ప్రెస్ ముందుకు రాకుండా రికార్డెడ్ ఇంటర్వ్యూలు.. ప్రెస్ నోట్లు ఇఛ్చి.. చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నారు. మూడు రాజధానుల ముచ్చట చెప్పమంటే.. ముందు కరోనా ముచ్చట చూడండి అంటూ ఎదురు చెబుతున్నారు. అనుకూలమా.. వ్యతిరేకమా అనేది ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. బిజెపి డైరెక్షన్ ని జవదాటే సమస్య లేదని.. జనసేన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూస్తేనే అర్ధమవుతుంది.
బిజెపి అయినా.. జనసేన అయినా ఒకటే మాట చెబుతున్నాయి. అమరావతి రైతులకు అన్యాయం జరగనీయమని.. వారి కోసం పోరాడతామని.. అమరావతి రైతులు అడిగిది అమరావతిని రాజధానిగా ఉంచమని కదా.. కాని దాని గురించి ఏమీ చెప్పకుండా.. వారి కోసం పోరాడతాం అంటే.. వారికి ప్రతి ఏడాది లీజు డబ్బులొచ్చేలా చేస్తామని మనం అర్ధం చేసుకోవాలి. ఎకరాలకు ఎకరాలు అమ్ముకోవడానికి.. ఇళ్ల స్దలాల కింద పంచేయడానికి కాదు కదా వారు భూములిచ్చింది… ఏదో రాజధాని వస్తుంది.. లాభపడతామని వారు ఊహించారు.. కాని ఇప్పుడంతా తలకిందులైంది. జనసేన నేతలు మాత్రం తలకిందులుగా మాటలు మార్చి చెబుతున్నారే తప్ప.. రాజధానిని మార్చడం దారుణం అని గాని.. తప్పు అని గాని.. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పోనీ అభివృద్ధి వికేంద్రీకరణ ఇలాగే జరగాలి.. కరెక్టే అని చెబుతున్నారా అంటే అదీ లేదు. పైగా 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది మేమొక్కరమే అంటున్నారు. అలా అన్నవాళ్లు.. 33 కాదు మూడు వేల ఎకరాల్లో అమరావతిలోనే కట్టండి అనే మాట మాత్రం అనటం లేదు.
జనవరిలో మూడు రాజధానులను ప్రకటించినప్పుడు..అమరావతి రైతులు రోడ్డెక్కినప్పుడు.. ఉడుకు నెత్తురున్న యువకుడిలా రెచ్చిపోయిన పవన్ కల్యాణ్… ఇప్పుడు అది శాస్త్రోక్తంగా ముగిశాక మాత్రం.. బీపీ డౌన్ అయిపోయిన ముసలివాడిలా స్పందిస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి. అసలు అమరావతి కోసమే బిజెపితో జత కట్టామని ప్రెస్ మీట్ లో చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అదే అమరావతిపై అదే బిజెపితో కలిసి డ్రామాలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బిజెపి మాట జవదాటకుండా.. వారి వ్యూహంలో పావుగా మారిపోయిన పవన్ కల్యాణ్.. అమరావతికి కాదుకదా.. తనకే తాను న్యాయం చేసుకోలేడనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది.